
కొచ్చి: ‘ఎయిర్ ఇండియా’పై నీలి నీడలు ఇప్పట్లో వీడేలా లేవు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. నేటి (సోమవారం) తెల్లవారుజామున కేరళలోని కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా టేకాఫ్‌ను నిలిపివేశారు. అనంతరం ఊహించని విధంగా విమాన ప్రయాణం ఆలస్యం అవుతున్నదని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ఈ విమానంలో లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ నేత హిబి ఈడెన్ కూడా ప్రయాణిస్తున్నారు.
కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (సీఐఏఎల్)ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక సమస్యల కారణంగా ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ను నిలిపివేసిందని, విమానాన్ని మారుస్తున్నామని, త్వరలోనే బయలుదేరే అవకాశం ఉందన్నారు. టేకాఫ్ రోల్ సమయంలో గుర్తించిన సాంకేతిక సమస్య కారణంగా కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్లే విమానం ఏఐ504 ఈ రోజు సాయంత్రం బయలుదేరేలా తిరిగి షెడ్యూల్ చేశారని అన్నారు. కాక్‌పిట్ సిబ్బంది ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి, టేకాఫ్ రన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారని, నిర్వహణ తనిఖీల కోసం విమానాన్ని తిరిగి బేకు తీసుకువచ్చారని ఆయన తెలిపారు.
Something unusual with this flight ✈️ AI 504, it just felt like the flight skid on the runway and hasn't taken off yet. Air India cancelled AI 504 and announced a new flight at 1 am which hasn't still started boarding, today is the third flight which has been AOG
— Hibi Eden (@HibiEden) August 17, 2025
ఈ ఘటన దరిమిలా ప్రయాణికులు విమానం నుంచి దిగిపోయారని, కొచ్చిలోని తమ సహోద్యోగులు వారికి సహాయం అందిస్తున్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. కాగా ఈ ఘటన సమయంలో విమానంలో ఉన్న ఎర్నాకులం కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ .. తాను ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయ్యే ప్రయత్నంలో రన్‌వే నుండి జారిపోయినట్లు అనిపించిందని సోషల్ మీడియాలో పోస్ట్‌లో తెలిపారు.
ఆ సమయంలో విమానంలో ఏదో అసాధారణమైనది జరిగిందన్నారు. తెల్లవారుజామున ఒంటి గంటకు తదుపరి విమానాన్ని ప్రకటించారని, అయితే ఇంకా బోర్డింగ్ ప్రారంభించనేలేదని ఆయన పేర్కొన్నారు.
కాగా 2022 జనవరిలో ప్రైవేట్ యాజమాన్యంలోకి వచ్చినప్పటి నుండి ఎయిర్ ఇండియా చివరి నిమిషంలో విమానాల జాప్యాలు, రద్దులను ఎదుర్కొంటోంది. దీనికి సాంకేతిక, నిర్వహణ సమస్యలే ప్రధాన కారణమని ఎయిర్ ఇండియా చెబుతూవస్తోంది.