వచ్చే ఏడాది మొదట్లో టీకా

Covid-19 vaccine possible by 2021 first quarter - Sakshi

భద్రతపై సందేహాలు వద్దు

నేనే తొలి డోసు తీసుకుంటా: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది మొదట్లో వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. టీకా భద్రతపై ఎవరికీ సందేహాలు, ఆందోళనలు లేకుండా తానే మొదటి డోసు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆదివారం సామాజిక మాధ్యమాల వేదికగా సండే సంవాద్‌ కార్యక్రమంలో మంత్రి తన ఫాలోవర్లతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు సందేహాలకు ఆయన జవాబులిచ్చారు. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కోవిడ్‌ తదనంతర ప్రపంచం ఎలా ఉంటుందన్న దానిపై మాట్లాడారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రయోగాలు బ్రిటన్‌లో మళ్లీ మొదలైన నేపథ్యంలోనే హర్షవర్ధన్‌ కరోనా వ్యాక్సిన్‌పై వివరంగా మాట్లాడారు. డీసీజీఐ అనుమతులు ఇచ్చాక సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ భారత్‌లో కూడా ప్రయోగాలు ప్రారంభించనుంది.  

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకే మొదటి ప్రాధాన్యం  
కరోనా వ్యాక్సిన్‌ ఎవరికైతే∙అత్యవసరమో వారికే ముందు లభిస్తుందని హర్షవర్ధన్‌ చెప్పారు. ఆర్థికంగా వారికి టీకా కొనుగోలు చేసే శక్తి ఉన్నా లేకపోయినా సీనియర్‌ సిటిజన్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు తొలి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.  ‘‘2021 మొదటి నాలుగు నెలల్లోనే కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలున్నాయి. ప్రజల్లో టీకా భద్రతపై భయాలుంటే నేను మొదట వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, సీనియర్‌ సిటిజన్లకి మొదట వ్యాక్సిన్‌ లభించేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుంది’’అని హర్షవర్ధన్‌ వెల్లడించారు. టీకా భద్రత, నాణ్యత, ధర, ఉత్పత్తి, సరఫరా వంటి అన్ని అంశాల్లోనూ ఇప్పటికే విస్తృత స్థాయిలో చర్చలు పూర్తయ్యాయని తెలిపారు.  

47 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా జోరు తగ్గడం లేదు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 94,372 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 47,54,356 కు చేరుకుంది. ఇటీవల మూడు రోజుల నుంచి వరుసగా 90 వేలకు పైగ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,114 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 78,586కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 37,02,595కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,73,175గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.47 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు  77.88 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top