సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు సముద్ర గర్భంలో ఒక్కటయ్యారు | Chinnadurai, Swetha Took Plunge And Got Married Underwater | Sakshi
Sakshi News home page

పెళ్లి అందరూ చేసుకుంటారు.. కానీ మా లెక్కవేరు!

Feb 2 2021 3:02 AM | Updated on Feb 2 2021 5:14 AM

Chinnadurai, Swetha Took Plunge And Got Married Underwater - Sakshi

నూతన వధూవరులు శ్వేత, చిన్నదొరై

సాక్షి , చెన్నై: అందరిలా బాజా భజంత్రీల నడుమ కల్యాణమండపంలో పెళ్లి చేసుకుంటే మజా ఏముందని అనుకుంది ఆ జంట. గతంలో తమిళనాడుకు చెందిన ఒక జంట భారీ బెలూన్లో ఆకాశంలో ఎగురుతూ పెళ్లి చేసుకుంది. అందుకు పూర్తి భిన్నంగా మరో జంట కడలి గర్భంలో కల్యాణం చేసుకుని మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. తమిళనాడులో సోమవారం జరిగిన ఈ చిత్రమైన కల్యాణం వివరాలు ఇలా ఉన్నాయి. తిరువన్నామలైకి చెందిన చిన్నదురై, కోయంబత్తూరు జిల్లాకు చెందిన శ్వేతకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరిద్దరూ చెన్నైలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.

తమ పెళ్లిని ప్రత్యేకంగా జరుపుకోవాలని భావించారు. సముద్రపు జలాల అడుగులో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెళ్లికొడుకు చిన్నదురై  పుదుచ్చేరికి వెళ్లి స్కూబా డైవింగ్‌ శిక్షణ కళాశాల నడిపే తన స్నేహితుని వద్ద శిక్షణ పొందాడు. సోమవారం ఉదయం పెళ్లికుమార్తె శ్వేతతో కలిసి చెన్నై సమీపం నీలాంగరై సముద్రంలో ఒక పడవలో అలలపై ప్రయాణిస్తూ  60 అడుగుల దూరానికి చేరుకున్నాడు.

వధూవరులిద్దరూ అక్కడ పెళ్లి దుస్తులు వేసుకున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్‌ అమర్చిన స్కూబా డైవింగ్‌ డ్రస్సును ఇద్దరు వేసుకుని సముద్రంలోకి దూకారు. సముద్రపు అడుగు భాగంలో ఉండే మొక్కల మధ్య పూలతో అలంకరించి ఉన్న వివాహవేదిక వద్దకు చేరుకున్నారు. అలల్లో తేలియాడుతూనే ఇద్దరూ మాలలు మార్చుకున్నారు. ఆ తరువాత పెళ్లికుమారుడు చిన్నదురై పెళ్లికుమార్తె శ్వేత మెడలో తాళి బొట్టుకట్టాడు. మాంగల్యధారణ పూర్తికాగానే వధూవరులిద్దరూ సముద్రతీరానికి చేరుకోగా అప్పటికే అక్కడ  సిద్దంగా ఉన్న  బంధువులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. 


సముద్ర గర్భంలో మాంగల్యధారణ దృశ్యం 

కాలుష్యంపై చైతన్యం కోసం.. 
వివాహానంతరం వరుడు చిన్నదొరై మీడియాతో మాట్లాడుతూ.. సముద్రంలోకి వెళ్లినప్పుడు సందర్శకులు  విచ్చలవిడిగా విసిరేసిన వ్యర్థాలు, వాటి వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని చూసి బాధపడి, కడలిని కాపాడుకోవాలని ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా పెళ్లి చేసుకున్నానని చెప్పారు. పెళ్లిని నేరుగా చూడలేకపోయిన లోటును తీర్చేందుకు ఈ నెల 13న చెన్నై శోళింగనల్లూరులో రిసెప్షన్‌ ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement