ఎమర్జెన్సీ తప్పేనని నాడు ఇందిరనే ఒప్పుకున్నారు: చిదంబరం | Chidambaram Key Comments Over Emergency And Indira Gandhi, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ తప్పేనని నాడు ఇందిరనే ఒప్పుకున్నారు: చిదంబరం

Jul 14 2024 4:29 PM | Updated on Jul 14 2024 6:31 PM

Chidambaram Key Comments Over Emergency And Indira Gandhi

ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం 1975 నాటి ఎమర్జెన్సీపైనే ప్రత్యేకంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జూన్‌ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని చిదంబరం చెప్పుకొచ్చారు.

కాగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ చిదంబరం తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘దేశంలో నేడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతాన్ని బీజేపీ మర్చిపోవాలి. ఇవాళ దేశంలో నివసిస్తున్న 75 శాతం ప్రజలు 1975 తర్వాత పుట్టినవారే ఉన్నారు. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ గురించి ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం లేదు కాదా?. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది. అయినా,  ఎమర్జెన్సీ విధించడం పొరపాటు అని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా అంగీకరించారు’ అని గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా.. కేంద్రం జూలై 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడంపై అంతకుముందు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిరోజూ ‘రాజ్యాంగ హత్య’కు పాల్పడుతోందన్నారు. దేశంలోని పేదలు, అణగారిన ప్రజల ఆత్మగౌరవాన్ని దోచుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సీనియర్‌ నేత జైరాం రమేష్‌.. ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఫలితాలు విడుదలైన రోజును(జూన్‌ 4)ను మోదీ ముక్తీ దివస్‌గా జరుపుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement