కేంద్రం నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం
ఈ అంశంపై అన్ని రాష్ట్రాలు కలిసి పోరాడాల్సిందే
యూపీలో 50 శాతం సీట్లు పెరిగితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది అవసరమే ఉండదు
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోవడం ఖాయం..
ఓ టీవీ చానల్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అతి పెద్ద కుట్రగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే సీట్లను పెంచాలనే అభిప్రాయం స్వార్థ రాజకీయ ఎత్తుగడలో భాగమే అని విమర్శించారు. ‘ఎంపీ స్థానాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంతుందో అదేస్థాయిలో సీట్ల పెంపు జరగాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోంది.
ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుంది. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది.
ఈ విషయమై అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపుపై ముందుకెళ్లాలి’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
దక్షిణాది నుంచి చోటు ఉండదు...
తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి 40, ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలున్నాయి. 40–80లో 40 తేడా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 స్థానాలు 120కి పెరుగుతాయి. ప్రతి చోటా 50 శాతం ఇస్తున్నారని అనుకుంటున్నారు. కానీ.. ఏ లెక్కతో ఇస్తున్నారు. మన దగ్గర వ్యత్యాసం పెంచుతున్నారు. యూపీ, తమిళనాడు మధ్య తేడా 40 ఉంది. ముందు ముందు ఇది 60కి పెరుగుతుంది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్ ఇలా నాలుగైదు రాష్ట్రాల సీట్లు పెరిగిన తర్వాత అక్కడి నుంచే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ, ఏపీ కలుపుకొని దక్షిణాది రాష్ట్రాల సీట్లు మొత్తం 130 అవుతాయి. 50 శాతం సీట్లు పెరిగితే అవి 195 అవుతాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు 50 శాతం పెరిగితే దక్షిణాది సీటు ఒక్కటి కూడా అవసరం లేదు. మొత్తం స్థానాలను 815కు పెంచితే అందులో నుంచి 195 తీసివేస్తే.. మమ్మల్ని అడిగేవారే ఉండరు. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీట్లు అవసరం. భవిష్యత్తులో ఆ అవసరమే ఉండదు.
మోదీ త్రీడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం
ప్రధాని మోదీ త్రీడీ పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతాన్ని ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్, డివల్యూషన్, డి్రస్కిమినేషన్ ఈ త్రీడీ విధానంలో ప్రభుత్వాన్ని మోదీ నడపాలనుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడాలనుకుంటున్నాం. గతంలో దక్షిణాదికి రాజకీయాల్లో ప్రాముఖ్యత ఉండేది. దక్షిణాదికి చెందిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, కర్ణాటకల నుంచి ఒక్క నిర్మలా సీతారామన్ మినహా మంత్రివర్గంలో చోటు లేదు.
ప్రధాని, రక్షణ, హోంశాఖ, పరిశ్రమలు, కామర్స్ వంటి టాప్ టెన్ పోర్ట్‌ఫోలియోల్లో మనకు ఏమీ దక్కలేదు. రాజకీయ ప్రాధాన్యంలో దక్షిణాదికి చాలా నష్టం జరుగుతోంది. వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అయ్యేందుకు అవకాశం ఉన్నవేళ ఆయనను ఇల్లు ఖాళీ చేయించి హైదరాబాద్‌కు పంపించేశారు. దక్షిణాదికి ఢిల్లీలో గుర్తింపేలేదు. మోదీ వచ్చిన తర్వాత రాజకీయ వివక్ష ఎక్కువైంది.
కేసీఆర్‌ది కుటుంబ సమస్య
కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వ్యక్తిగత వైరం లేదు, ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు. కేసీఆర్ సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడే. గృహ నిర్బంధం చేసి ఏదో రకంగా సీఎం కావాలని చూస్తున్నది అల్లుడు, మీరిద్దరు కాదు నేను సీఎం అవుతా అని కవిత చూస్తున్నది. వారసత్వ రాజకీయాలు నమ్ముకున్న కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకు కాలేదు అల్లుడు అయ్యాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిని అవుతా అని హరీశ్‌రావు అనుకుంటున్నారు.
ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నాయి. కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో వాళ్లే నిర్బంధించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసిపోవడం ఖాయం. వాళ్లది ఫెవికాల్ బంధం. వాళ్లిద్దరినీ వేర్వేరుగా చూడాలనుకోవడంలేదు. రెండింటినీ మడతేసి కొట్టాలన్నదే నా లెక్క. నాకు ఇప్పటికైతే జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. ఇంకా 8 ఏళ్లు 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం చాలా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది.


