బిహార్‌లో మోగిన ఎన్నికల నగారా

CEC Release Elections Schedule For Bihar Assembly Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్ 28న తొలివిడత పోలింగ్‌, నవంబర్ 3న రెండో విడత , మూడో విడత నవంబర్ 7న జరుగనుంది. నవంబర్ 10 ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను ప్రకటించనుంది. శుక్రవారం ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్‌ అరోరా ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీ గడువు నవంబర్‌ 29తో ముగియనుంది. దేశంలో కరోనా విజృంభణ అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు అరోరా తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని 15 రాష్ట్రాల్లో 64 స్థానాలకు ఉప ఎన్నికలకు సైతం షెడ్యూల్‌ను ప్రకటించింది. (చాణిక్యుడి చతురత.. వృద్ధ నేత వ్యూహాలు)

షెడ్యూల్‌ వివరాలు..

మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243

మొదటి విడత పోలింగ్ తేదీ - అక్టోబర్ 28
రెండవ విడత పోలింగ్ తేదీ - నవంబర్ 3
చివరి విడత పోలింగ్ తేదీ - నవంబర్ 7
ఓట్ల లెక్కింపు - నవంబర్ 10

71 స్థానాలకు పోలింగ్  తొలి దశలో పోలింగ్ 
రెండో విడతలో 94 స్థానాలకు ఎన్నికలు 
మూడో విడతలో 78 స్థానాలకు ఎన్నికలు
నామినేషన్ల ప్రారంభ తేదీ:  అక్టోబర్ 1
నామినేషన్లకు చివరి తేదీ - అక్టోబర్ 8

 

పోలింగ్ కేంద్రాలు : లక్షకు పైగా
భారీ ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి లేదు
పోలింగ్  సమయాన్ని గంట సమయం పెంచిన ఈసీ
ఆన్‌లైన్‌ ద్వారా కూడా నామినేషన్ల స్వీకరణ
చివరి గంటలో కరోనా పేషంట్లకు ఓటు వేసేందుకు అనుమతి
పోలింగ్ కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించడం తప్పనిసరి..
ఒక్కో పోలింగ్ బూత్‌లో 1000 మంది ఓటర్లు
పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందుబాటులో ఉంచుతాం: ఈసీ
ప్రధాన పార్టీలు : బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌, ఎల్జేపీ, 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top