మాటిమాటికీ రసగుల్లా తిన్నాడని..తందూరీ పొయ్యిలో పడేశాడు | Caterer throws 11 year-old into burning tandoor | Sakshi
Sakshi News home page

మాటిమాటికీ రసగుల్లా తిన్నాడని..తందూరీ పొయ్యిలో పడేశాడు

Apr 18 2026 5:30 AM | Updated on Apr 18 2026 5:30 AM

Caterer throws 11 year-old into burning tandoor

తీవ్ర గాయాలపాలైన 11 ఏళ్ల పిల్లాడు 

పరారైన క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌ 

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం

బస్తీ(యూపీ): వివాహ శుభకార్యంలో అతిథుల కోసం సిద్ధంచేసి రసగుల్లాలను మాటిమాటికీ తినేస్తున్నాడన్న కోపంతో ఒక క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌ 11 ఏళ్ల పిల్లాడిని తందూరీ పొయ్యిలో పడేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఉదంతంలో పిల్లాడికి ఛాతీ నుంచి ముఖందాకా తీవ్రస్థాయిలో కాలినగాయాలయ్యాయి. వెంటనే బంధువులు పిల్లాడిని అయోధ్య వైద్య బోధనాస్పత్రిలో చేరి్పంచారు. 

బస్తీ జిల్లాలోని ఛవానీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మలౌలీ గోసాయ్‌ గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం 11 ఏళ్ల పిల్లాడు ఛమన్‌ అలియాస్‌ అమర్‌ స్వస్థలం గోంఢా పరిధిలోని దుర్జాన్‌పూర్‌. కానీ తన అమ్మ సొంతూరు బఘానాలాలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటున్నాడు. బంధువుల పెళ్లి కావడంతో అమ్మమ్మతో కలిసి మలౌలీకి వచ్చాడు. పెళ్లి వేడుకలో బంధువుల కోసం కౌంటర్‌ వద్ద రసగుల్లా సిద్ధంచేశారు. రసగుల్లాలను పదేపదే పిల్లాడు తీసుకోవడం చూసి అక్కడి క్యాటరింగ్‌ సర్వీస్‌ కాంట్రాక్టర్‌ పిల్లాడిని కోప్పడ్డాడు. 

అయినాసరే పిల్లాడు మరో రసగుల్లా తీసుకోవడంతో పట్టరాని ఆగ్రహంతో పిల్లాడిని కాంట్రాక్టర్‌ వెంటనే మండుతున్న తందూరీ పొయ్యి మీద కూర్చోబెట్టాడు. తీవ్రమైన వేడిమికి తాళలేక పిల్లాడు పట్టుతప్పి లోపల పడిపోయాడు. కాలినగాయాలతో కేకలువేయడంతో బంధువులు వచ్చి బయటకుతీసి వెంటనే అయోధ్య ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం లక్నో బోధనాస్పత్రిలో చేర్పించారు. మేనమామ దేవిదీన్‌ నిషద్‌ ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు సెక్షన్‌ 109(1)(హత్యా ప్రయత్నం) నేరం కింద పలువురిపై కేసు నమోదుచేశారు. పారిపోయిన కాంట్రాక్టర్‌ కోసం వేటమొదలెట్టామని సర్కిల్‌ ఆఫీసర్‌ హరయా స్వనిమా సింగ్‌ చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement