
కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. విద్యా సంబంధమైన పలు అంశాలపై ఈయన వెలువరించిన తీర్పులు ఇటీవల తీవ్ర రాజకీయ చర్చలకు దారితీశాయి. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు ఆయన మంగళవారం రాజీనామా పత్రం సమర్పించాక అన్ని విషయాలను మీడియాతో పంచుకుంటానంటూ బదులిచ్చారు.
రాజీనామా లేఖను మంగళవారం మొదటగా రాష్ట్రపతికి, లేఖ ప్రతులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తానన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ప్రభుత్వ సాయం అందుకునే, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ దర్యాప్తు జరపాలంటూ ఈడీ, సీబీఐలకు ఆదేశాలిచ్చారు.