వీడియో: నీళ్లలో దూకాడు.. బీజేపీ తరపున జాక్‌పాట్‌ కొట్టాడు

BJP Picks Viral Kantilal Amrutiya As Gujarat Morbi MLA Candidate - Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌ మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం.. యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సుమారు 135 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదంపై నమోదైన కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్న టైంలో.. ఓ వ్యక్తి ప్రముఖంగా వార్తల్లో హైలెట్‌ అయ్యారు. ఆయనెవరో కాదు.. మోర్బీ మాజీ ఎమ్మెల్యే కంతిలాల్‌ అమృతీయ(60). ఇప్పుడు ఆయన జాక్‌పాట్‌ కొట్టాడు. 

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. ఇందులో మోర్బీ నియోజవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి కాకుండా.. కంతిలాల్‌కు సీటు ఇచ్చి ఆశ్చర్యపర్చింది బీజేపీ. ఈ విషయాన్ని స్థానిక మీడియా ఛానెల్స్‌ ప్రముఖంగా ప్రచురించాయి. 

అక్టోబర్‌ 30వ తేదీన రాత్రి ప్రమాదం జరగ్గా.. ఆ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని లైఫ్‌ ట్యూబ్‌ ధరించి నీళ్లలోకి దూకి సహాయక చర్యల్లోకి పాల్గొన్నారు ఆయన. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ కాగా.. మోకాళ్ల లోతు నీళ్లలో ఆయన ఆ పని చేశారంటూ మరోవైపు ట్రోలింగ్‌ కూడా నడిచింది. కంతిలాల్‌ అమృతీయ.. బీజేపీ నేత. గతంలో రెండుసార్లు మోర్బీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సేవాకార్యక్రమాలతోనూ ఆయన మంచి గుర్తింపు ఉంది అక్కడ.  అయితే..

ఈ అసెంబ్లీ ఎన్నికల జాబితాలో తొలుత కంతిలాల్‌ లేడని, అయితే సోషల్‌ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న తరుణంలోనే ఆయనకు బీజేపీ సీటు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే బ్రిజేష్‌ మెర్జాను మోర్బీ ప్రమాదం నేపథ్యంలో ప్రజావ్యతిరేకతకు కారణం అవుతారనే ఉద్దేశంతోనే తప్పించినట్లు కథనాలు అందుతున్నాయి.  ఇక గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండు దశల్లో డిసెంబర్‌ 1, 5వ తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు.. డిసెంబర్‌ 8వ తేదీన ప్రకటిస్తారు.

ఇదీ చదవండి: క్రికెటర్‌ జడేజా భార్య.. బీజేపీ సీటుపై అక్కడ పోటీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top