BJP chief Chandrakant Patil: మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

BJP chief Chandrakant Patil Controversial Comments - Sakshi

మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాటిల్ వివాదంలో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు మండిపడుతున్నారు.

వివరాల ప్రకారం.. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై స్టే విధించడంతో గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో పాలిటిక్స్‌ వేడెక్కాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం న్యాయస్థానాల్లో జరిగిన పోరాటంలో ఉద్దవ్‌ థాక్రే సర్కార్‌ ఓడిపోయిందని బీజేపీ ఆరోపిస్తుండగా, కేంద్రమే సరైన డేటాను అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం  ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కుమ‌ర్తె, ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నుంచి ఎలా ఉపశమనం లభించిందని ప్రశ్నిస్తూ.. ‘‘ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ‘ఎవరినో’ కలిశారు.. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియడం లేదు. మరో రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది’’ అని తెలిపారు. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనకు నేతృత్వం వహిస్తున్న పాటిల్.. ‘మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికి వెళ్లి వంట చేసుకోండి’ అని సూలేను ఉద్దేశించి కామెంట్స్‌ చేశారు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌లు వివాదాస్పదమయ్యాయి. పాటిల్‌ వ్యాఖ్యలపై సుప్రియా సూలే భర్త సదానంద్ సూలే స్పందించారు. పాటిల్ మాట‌ల‌ను ఖండిస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘ నా భార్యను చూసి గర్వపడుతున్నాను. ఆమె ఒక గృహిణి, తల్లి. అలాగే.. స‌క్సెస్‌ఫుల్ పొలిటీషియ‌న్. బీజేపీ నేతలు స్త్రీ ద్వేషులు. వీలైనప్పుడల్లా స్త్రీలను వారు కించపరుస్తారనే ఉంటారు. భారతదేశంలోని అనేక మంది కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులైన మహిళలలో నా భార్య కూడా ఒక‌రు. చంద్ర‌కాంత్ పాటిల్ మాట‌లు మ‌హిళలందరికీ అవమాన‌క‌ర‌మే.’’ అని మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: అసెంబ్లీలో అఖిలేష్‌ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి రియాక్షన్‌ ఇది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top