త్వరలో మరో ‘జోడో’!

Big Takeaway From Congress Plenary Session Plan For Another Yatra - Sakshi

నవా రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌): అదానీ వ్యవహారంలో మోదీ సర్కారుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. అధికార బీజేపీ నేతలు నిస్సిగ్గుగా అదానీ గ్రూపుకు ఏకంగా పార్లమెంటులోనే కొమ్ముకాస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వ్యాపార మిషతో వచ్చి భారత్‌ను ఆక్రమించిన ఈస్టిండియా కంపెనీతో అదానీ గ్రూపును పోల్చారు! అక్రమ మార్గాల్లో భారీగా సంపద పోగేసి దేశానికి వ్యతిరేకంగా పని చేస్తోందని ఆరోపించారు. దీనిపై మోదీ స్పందనేమిటని పార్లమెంటులో విపక్షాలన్నీ నిలదీస్తే అది తప్ప అన్ని విషయాలపైనా మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు.

‘‘దీనిపై నిజం వెలుగు చూసేదాకా అదానీ గ్రూపు వ్యాపార పద్ధతులు తదితరాలపై ప్రశ్నస్త్రాలు సంధిస్తూనే ఉంటాం. అవసరమైతే పార్లమెంటులో వెయ్యిసార్లైనా దీన్ని ప్రస్తావిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఆదివారం రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ 85వ ప్లీనరీ మూడో రోజు ముగింపు సమావేశాలను ఉద్దేశించి రాహుల్‌ ప్రసంగించారు. ‘‘అదానీకి ఒక్కటే చెప్పదలచా. ఆయన కంపెనీ దేశానికి నష్టం చేస్తోంది. దేశ మౌలిక వసతులన్నింటినీ చెరబడుతోంది’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.

‘‘పోర్టులు తదితరాలతో పాటు దేశ సంపదను చెరబట్టిన కంపెనీకి వ్యతిరేకంగా దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం మేం చేస్తున్న పోరాటమిది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘చరిత్ర పునరావృతమవుతోంది. అవసరమైతే మరోసారి మరో కంపెనీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాడుతుంది’’ అని ప్రకటించారు. 

కాశ్మీరీల్లో  దేశభక్తిని రగిల్చాం... 
భారత్‌ జోడో యాత్ర ద్వారా జరిగిన ‘తపస్సు’ తాలూకు స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని రాహుల్‌ పిలుపునిచ్చారు. ‘‘అందుకు కావాల్సిన వ్యూహాలు రూపొందించండి. దేశమంతటితో పాటు నేను కూడా వాటిలో భాగస్వామిని అవుతా’’ అని సూచించారు. తద్వారా త్వరలో మరో దేశవ్యాప్త యాత్ర ఉంటుందని సంకేతాలిచ్చారు. ‘‘జోడో యాత్రలో ప్రజలు లక్షలాదిగా పాల్గొన్నారు. యాత్ర పొడవునా నేనెంతో నేర్చుకున్నా. కన్యాకుమారిలో మొదలై కశ్మీర్‌ చేరేసరికి ఎంతగానో మారాను. మిగతా ప్రజలంతా ఆనందంగా ఉంటే కశ్మీరీలు మాత్రమే ఎందుకు బాధల్లో ఉన్నారని ఒక బాలుడు అడిగాడు.

నా యాత్ర కాశ్మీర్‌లో ప్రవేశించాక పోలీసు సిబ్బంది పత్తా లేకుండా పోయారు. కానీ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు అంతటా వేలాదిగా కశ్మీరీలు త్రివర్ణం చేబూని నాతో పాటు నడిచారు. తానూ లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేశానని మోదీ చెప్పుకున్నారు. నాతోపాటు వేలాది మంది కాశ్మీరీలు లాల్‌చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. త్రివర్ణంపై కశీ్మరీల్లో ప్రేమను మోదీ తన వేధింపు చర్యల ద్వారా దూరం చేస్తే మేం దాన్ని వారిలో తిరిగి పాదుగొల్పాం. ఈ తేడాను ఆయన అర్థం చేసుకోలేకపోయారు’’ అని కాంగ్రెస్‌ ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య చెప్పుకొచ్చారు. 

సమైక్యంగా శ్రమిద్దాం... ఎన్నికల పరీక్ష నెగ్గుదాం 
‘‘కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున ఈ ఏడాదంతా చాలా కీలకం. ఆ ఎన్నికల్లో విజయానికి సమైక్యంగా, క్రమశిక్షణతో కృషి చేయండి’’ అని పార్టీ నేతలు, కార్యకర్తలకు రాయ్‌పూర్‌ ప్లీనరీ పిలుపునిచ్చింది. తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికలకు చక్కని వేదిక సిద్ధం చేసుకుందామని పేర్కొంది. ఈ మేరకు ఐదు సూత్రాలతో రాయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను ప్లీనరీ ఆమోదించింది.

భావ సారూప్యమున్న పార్టీలతో నిర్మాణాత్మక ఉమ్మడి ప్రణాళికతో కలిసి పని చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, అది ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ పేర్కొంది. ‘‘బీజేపీ, ఆరెస్సెస్‌లతో, వాటి మోసపూరిత రాజకీయాలతో ఎన్నడూ రాజీ పడని ఏకైక పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే.

బీజేపీ నియంతృత్వానికి, మతవాద, ఆశ్రిత పెట్టుబడిదారీ పోకడలకు వ్యతిరేకంగా దేశ రాజకీయ విలువ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, సమాజంలో చీలిక తెచ్చే యత్నాలు, రాజకీయ నియంతృత్వాలపై రాజీలేని పోరాటం చేస్తాం. ఇందుకోసం భావ సారూప్య పార్టీలతో కలిసి పని చేస్తాం’’ అని డిక్లరేషన్‌లో పేర్కొంది.  

పాసీఘాట్‌ నుంచి పోరుబందర్‌ దాకా...! 
తూర్పున అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసీఘాట్‌ నుంచి   పశ్చిమాన గుజరాత్‌లోని పోరుబందర్‌ దాకా మరో దేశవ్యాప్త పాదయాత్ర చేసే యోచన ఉన్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వెల్లడించారు. ‘‘భారత్‌ జోడో యాత్ర సక్సెస్‌తో పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. మరో యాత్ర కోసం కార్యకర్తలు ఉవ్విళ్లూరుతున్నారు.

అది జోడో యాత్రకు భిన్నంగా ఉంటుంది. దారి పొడవునా నదులు, దుర్గమారణ్యాలున్నందున చాలావరకు కాలినడకన, అక్కడక్కడా ఇతరత్రా సాగొచ్చు. జూన్‌కు ముందు గానీ, నవంబర్‌ ముందు గానీ కొత్త యాత్ర మొదలు కావచ్చు. కొద్ది వారాల్లో నిర్ణయం తీసుకుంటాం’’ అని వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top