Pathan Controversy: మీ కూతురుతో క‌లిసి పఠాన్‌ సినిమా చూడండి: షారూక్‌కు మంత్రి సవాల్‌

‘Besharam Rang Row: MP Speaker Asks SRK to Watch Pathaan With Daughter - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌, దీపికా పదుకొనె నటించిన ‘పఠాన్‌’ సినిమాపై విడుదలకు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. వచ్చే జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న పఠాన్‌ మూవీపై దేశ వ్యాప్తగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల విడుదలైన సినిమాలోని బేషరం రంగ్‌ పాటపై హిందూ సంఘాలతో పాటు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాయ్‌కాట్ పఠాన్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో  ట్రెండ్ చేస్తున్నారు.

ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు. ఆ సాంగ్‌లో దీపిక, షారూఖ్‌ ధరించిన దుస్తుల్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాషాయ నేత‌లు త‌ప్పుప‌డుతున్నారు. బేషరం రంగ్ అనే పాట టైటిల్, దాని అర్థం అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఇప్పటికే మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఈ పాట‌లో ఉన్న కాస్ట్యూమ్‌ క‌లుషిత‌మైన మైండ్‌సెట్‌ను చాటుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు. పాటలో కొన్ని మార్పులు చేయాలని లేదంటే ఈ సినిమాను విడుదల చేయకుండా బహిష్కరించాలంటూ డిమాండ్‌ చేశారు.

తాజాగా పఠాన్‌  చిత్రాన్ని మధ్యప్రదేశ్‌ స్పీకర్‌ గిరీష్‌ గౌతమ్‌ వ్యతిరేకించారు. షారుక్‌ఖాన్‌ తన కూతురితో కలిసి ఈ సినిమాను చూడాలని సవాల్‌ విసిరారు. కూతురితో పఠాన్‌ చిత్రాన్ని చూసినట్లు ప్రపంచానికి తెలియజేస్తూ ఓ ఫోటో సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేగాక ఇలాంటి సినిమానే ప్ర‌వ‌క్త‌పై తీయాల‌ని షారూక్‌కు స్పీక‌ర్ గౌత‌మ్‌ చాలెంజ్‌చేశారు.

కాగా మధ్యప్రదేశ్‌లో సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయిదు రోజులపాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో పఠాన్‌ అంశాన్ని అధికార బీజేపీ అసెంబ్లీలో చర్చకు తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ గోవింద్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరితో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా పఠాన్‌ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ సినిమా తమ విలువలకు విరుద్ధంగాఉందటూ విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top