
స్నేహితులతో చేసిన సరదా పందెం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. బెంగళూరులో కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో ఉన్న స్నేహితుడికి ఆటో కొనిస్తామని ఆశపెట్టి అతడి మృతికి కారణమయ్యారు. దీపావళి రోజు బాణాసంచాతో నిండిన డబ్బాపై కూర్చుంటే ఆటో కొనిస్తామని ఆశపెట్టారు.
అయితే అధిక మొత్తంలో బాంబులు ఒకేసారి పేలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషాద ఘటన బెంగళూరు- కోననకుంటెలో చోటుచేసుకుంది. కోననకుంటెలో అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా . శబరీష్, అతని స్నేహితులతో కలిసి టపాసులు కాల్చుతున్నారు.
మద్యం మత్తులో ఉన్న శబరీష్‌ను బాణాసంచా పెట్టిన డబ్బాపై కూర్చుంటే ఆక్షా కొనిస్తామని స్నేహితులు ఆశచూపారు. ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్న శబరీష్ కొత్త ఆటో వస్తది కదా అని అనుకొని ఆ సవాల్‌ను స్వీకరించాడు. పందెం ప్రకారం శబరీష్ ఆ డబ్బాపై కూర్చున్నాడు.ఆ తర్వాత ఆ ఆకతాయిలు అందరూ దూరంగా వెళ్లారు.
శబరీష్ కూర్చున్న డబ్బా కింద ఉన్న బాంబులు భారీ శబ్ధంతో పేలాయి. అధిక మొత్తంలో బాంబులు పేలడంతో శబరీష్ అక్కడే కిందపడిపోయాడు. పేలుడు ధాటికి అతడు గాయపడ్డాడు. ఈ ఘటనలో శబరీష్ అక్కడికక్కడే మరణించాడు. ఆటో కోసం ఆశపడి బాంబులు పెట్టిన డబ్బాపై కూర్చుని ఆఖరికి ప్రాణాలు వదిలాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.