హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్‌ ట్విస్ట్‌ | Cabinet Discontent Resurfaces In Karnataka Congress, Ministers Rush To Delhi Amid Portfolio Row | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్‌ ట్విస్ట్‌

Jun 9 2026 9:38 AM | Updated on Jun 13 2026 3:24 PM

Another Twist In Karnataka Congress Cabinet Portfolios

కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు సర్దుమణిగాయి అనుకునేలోపే మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. కేబినెట్‌ కేటాయింపులపై అసంతృప్తి.. ఇంకా చల్లారలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ‘మా మొర ఆలకించండి మహా ప్రభో’.. అంటూ మరో ఇద్దరు సీనియర్లు ఢిల్లీకి పయనమవడం కొత్త చర్చకు దారితీసింది.

బెంగళూరు డెవలప్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కృష్ణ బైరేగౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈ కీలక శాఖ నిర్వహణపై స్పష్టత లేకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్‌ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్‌డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలోనే ఉండటంతో అధికార విభజనపై గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన పార్టీ హైకమాండ్‌తో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నారని సమాచారం.

ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన గతంలోనూ నాయకత్వ మార్పుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇక గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఇప్పటికే సీనియర్‌ నేత రామలింగారెడ్డి వ్యవహారం, ఆయన రాజీనామా వెనక్కి తీసుకోవడం.. తదితర పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారింది. అదే సమయంలో సీనియర్ నేత కెహెచ్ మునియప్ప కూడా తనకు ఇచ్చిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేవారు. తన స్థాయికి తగ్గ ప్రాధాన్యం లభించలేదని హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో సహా పార్టీ పెద్దలకు తన అభిప్రాయాలు తెలియజేశానని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలివారాల్లోనే కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ అసంతృప్తి, శాఖల పంపిణీ వివాదాలు, ఢిల్లీ లాబీయింగ్ రాజకీయ వేడి పెంచుతున్నాయి. పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement