బ్యాడ్మింటన్‌ టోర్నీ షురూ | - | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ టోర్నీ షురూ

Jul 28 2026 1:06 AM | Updated on Jul 28 2026 1:06 AM

తుమకూరు: రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, తుమకూరు నగరంలో సోమవారం ఆరు రోజుల ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ అండర్‌–11, అండర్‌–13 విభాగాల టోర్నమెంట్‌ను సిద్ధగంగ మఠం సిద్ధలింగస్వామిజీ, ఎమ్మెల్యే జి.బి. జ్యోతిగణేష్‌, రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు కుమార బంగారప్ప బ్యాడ్మింటన్‌ ఆడి ప్రారంభించారు. స్వామిజీ మాట్లాడుతూ, పిల్లలను చదువులకే పరిమితం చేయకూడదని, ఆటపాటల్లోనూ ప్రతిభ సాధించాలని తెలిపారు. యలహంక సమీపంలో ప్రభుత్వం 40 ఎకరాలలో అన్ని సౌకర్యాలతో కూడిన స్టేడియం నిర్మిస్తుందని కుమార బంగారప్ప తెలిపారు.

పెట్రోలు మంటల్లో..

రైతన్న ఆత్మహత్య

మైసూరు: రాష్ట్రంలో అప్పుల బాధలతో రైతుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. ఏకంగా పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని సజీవ దహనమయ్యాడు. మైసూరులోని బోగాది రింగ్‌ రోడ్డులోని ఒక హోటల్‌ వెనుక భాగంలో జరిగింది. జిల్లాలోని హెచ్‌.డి.కోట తాలూకా, హంపాపుర హోబ్లీ, కణియనహుండికి చెందిన పి. శివకుమార్‌ (35), భార్య చేతన వ్యవసాయం కోసం అప్పులు చేశారు. కానీ పంటలు పండక, ధరల లేక నష్టాల పాలయ్యారు. అప్పులు కట్టాలని ఒత్తిళ్లు పెరగడంతో శివకుమార్‌కు దిక్కుతోచలేదు. ఇక్కడకు వచ్చి ఖాళీ ప్రదేశంలో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో కేకలు పెడుతున్న అతడిని కొందరు కె.ఆర్‌. ఆసుపత్రిలో చేర్చగా, కొంతసేపటికే మరణించాడు. సకాలంలో వైద్యులు చికిత్స చేయలేదని ఆరోపణలున్నాయి. ఇదే ఆరోపణతో భార్య సరస్వతీపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

రౌడీ నరికివేత

తుమకూరు: తుమకూరు నగర శివార్లలోని బెళగుంబ సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న రౌడీషీటర్‌పై దుండగుల గుంపు దాడి చేసి, నరికి చంపారు. హతుడు వీరన్న అలియాస్‌ మల్లా (42), ఇతను బెళగుంబ వద్ద తోట ఇంట్లో నివసించే రౌడీషీటర్‌. వీరన్న మల్లా 2008లో జరిగిన గడ్డ రాజు అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడని చెబుతున్నారు. వడ్డరహళ్లి క్రాస్‌ సమీపంలో గడ్డరాజు హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత, మల్లాపై రౌడీషీట్‌ పెట్టారు. బైక్‌పై వెళుతుండగా మరో వాహనంతో ఢీకొట్టి, కత్తులతో గొంతు మీద దాడి చేసి హతమార్చారు. వెంటనే తుమకూరు గ్రామీణ పోలీసులు , ఎస్పీ అశోక్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సీటీ రవికి హైకోర్టు ఊరట

శివాజీనగర: నీట్‌ నిరసనల్లో ముల్లాలు ఎందుకు పాల్గొంటున్నారు అని ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో బీజేపీ ఎమ్మెల్సీ సీ.టీ.రవికి హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని పోలీసులను ఆదేశించింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ సీ.టీ.రవి హైకోర్టును ఆశ్రయించారు. విచారించి స్టే ఇస్తూ, 31కి వాయిదా వేసింది. మరోవైపు చిక్కమగళూరు పోలీసులు ఇచ్చిన నోటీసుకు వివరణ ఇచ్చేందుకు సీటీ రవి వారం గడువు కోరారు. తనకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన పోలీసులు బెదిరించారని ఆరోపించారు.

శ్రావ్యంగా భక్తిగాన కచేరీ

చింతామణి: చింతామణి తాలూకాలోని కై వార యోగి నారేయణస్వామి మఠంలో గురు పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు గురుపూజా సంగీతోత్సవాలను సోమవారం ధర్మాధికారి డా.జయరాం దంపతులు గోపూజతో ప్రారంభించారు. అలంకరించిన తాతయ్య విగ్రహాలకు పూజలు జరిపారు. జయరాం ఆధ్వర్యంలో సంకీర్తనను ఆలపించారు. కోలారు జిల్లా విద్వాంసుల గాన కచేరీ భక్తులను తన్మయుల్ని చేసింది. బాలల భరతనాట్య ప్రదర్శన ముగ్ధుల్ని చేసింది.

మెట్రోలో మహిళ రుబాబు

శివాజీనగర: బెంగళూరులోని నమ్మ మెట్రోలో ఇతర భాషలవారి గొడవలు పెరిగాయి. ఓ కన్నడ ప్రయాణికురాలిని ఉత్తరాది మహిళ దూషించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రైలులో ప్రయాణిస్తుండగా, సీటు కోసం రభస మొదలైంది. మాటల యుద్ధంగా మారింది. కన్నడిగులను, భాషను చిన్నచూపు చూసేలా ఆ మహిళ, కన్నడ మహిళను అవమానించింది. ఈ అసభ్య ప్రవర్తన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా, కన్నడిగులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. బెంగళూరుకు వచ్చి ఇక్కడి స్థానికుల పట్ల దుర అహంకారంతో ప్రవర్తించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి దుండగులపై నమ్మ మెట్రో అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

వీరన్న మల్లా హత్య దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement