బొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ జిల్లాలోని చన్నపట్టణ తాలూకాలోని దేవహొసహళ్లిలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర, సంజీవరాయస్వామి ఆలయాల రథోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేడుకలను ప్రారంభించారు. భక్తులు ఉత్సాహంగా తేరును లాగారు. సాయంత్రం సంగీత కచేరీ, దీపాల పండుగ, సరస్సులో తెప్పోత్సవం కనులపండువగా సాగాయి. అయితే, గర్భగుడిలో స్వామివారి దర్శనం దొరకడం లేదని, డబ్బు పెట్టి టికెట్లు అమ్ముతున్నారని భక్తులు ఆగ్రహించారు. తాము గంటల తరబడి వరుసలో నిలబడితే, కొంతమంది డబ్బు చెల్లించి త్వరగా దర్శనం చేసుకుంటున్నారు అని ఆరోపించారు.
బిడది దాడి.. రైతులకు
ముందస్తు బెయిలు
దొడ్డబళ్లాపురం: బిడది టౌన్‌షిప్ భూములను సర్వే చేయడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులపై దాడిచేసిన కేసులో 11 మంది రైతులకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. జూన్ 13న బిడది పరిధిలోని మండలహళ్లిలో అధికారుల మీద మహిళలు, రైతులు చీపుర్లు, చెప్పులతో దాడులు చేశారు. అధికారులు బిడది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలువురు రైతులు కోర్టును ఆశ్రయించగా రామనగర జిల్లా కోర్టు 11మందికి ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఇది తమ మొదటి విజయమని జేడీఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీలో చెరకు
రైతుల నిరసన
మైసూరు: చెరకు రైతులకు బకాయిలను చెల్లిచాలని నంజనగూడు తాలూకాలోని బన్నారి చక్కెర కర్మాగారంలోకి రైతులు చొచ్చుకెళ్లారు. పరిపాలనా కార్యాలయం ముందు గుమిగూడి నినాదాలు చేశారు. రాష్ట్ర చెరకు రైతుల సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం క్రషింగ్‌కు ముందే చెరకు ధరను ప్రకటించాలని, చెరకు కోత, రవాణా ఖర్చులను కూడా నిర్ణయించాలని, గతంలో కొన్న చెరకు బకాయిలను రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ ఈ ఫ్యాక్టరీ అవేమీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మార్కెట్‌లో టన్ను రంపపు పొట్టు ధర రూ. 3500గా ఉంది. కానీ రైతులు ఏడాదిగా పండించే చెరకు ధర అంతకంటే తక్కువగా ఉందని అన్నారు. బరువు తూచడంలోనూ రైతులు మోసగిస్తున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ వ్యవహారాన్ని పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు రాకుండా ఫ్యాక్టరీ గేట్లను మూసివేసినా లోపలకు చొరబడి నిరసన తెలిపారు. పెద్దసంఖ్యలో రైతుల, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కిలాడీ కోడలు..
ప్రియునిచే ఇల్లు దోపిడీ
యశవంతపుర: ఇంటిలోకి దూరి భారీగా డబ్బు, బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు ఒక్క రోజులోనే దొరికిపోయారు. అమృత, ఆమె ప్రియుడు పరమేశ్ చేతన్‌ను పట్టుకున్న పోలీసులు రూ.56 లక్షల విలువగల 441 గ్రాముల బంగారం, రూ.13.40 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. హాసన్ తాలూకా దొడ్డహొన్నేనహళ్లిలో శనివారం కేశవగౌడ భార్య జయలక్ష్మి, కొడుకు వేణుగోపాల్ పొలానికి వెళ్లారు. ఈ సమయంలో ఇంటి కోడలు అమృత ప్లాన్ వేసి ప్రియుడు పరమేశ్‌ను పిలిపించింది. దోపిడీ చేసినట్లు చిత్రం సృష్టించి ఇంట్లోని డబ్బు, బంగారాన్ని అతనికి ఇచ్చి పంపింది. తరువాత ఏమి తెలియనట్లు ఇంటికి తాళం వేసుకొని పొలానికి వెళ్లింది. తరువాత ఇంటికి వచ్చిన అత్త చోరీ జరిగినట్లు తెలుసుకుంది. బీరువాను తెరిచి చూడగా బంగారం, నగదు కనబడలేదు. దీంతో హాసన్ గ్రామాంతర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అమృత బండారం బయటపడింది. ఆమెతో పాటు ప్రియున్ని అరెస్టు చేశారు. అత్తతో ఉన్న గొడవలతో పాటు ప్రియుని కోసం చోరీ చేయించినట్లు పోలీసుల విచారణలో బయట పడింది.


