ఇంజన్‌ వైఫల్యమే! | Air India crash probe focuses on engine, flaps | Sakshi
Sakshi News home page

ఇంజన్‌ వైఫల్యమే!

Jun 14 2025 5:32 AM | Updated on Jun 14 2025 6:38 AM

Air India crash probe focuses on engine, flaps

మేడే కాల్, వీడియోల్లో ఇంజన్‌ శబ్దమే విన్పించలేదు

టేకాఫ్‌ అవగానే మూగబోయి ఉంటాయి: నిపుణులు

రెండు ఇంజన్లు విఫలమవడం అత్యంత అసాధారణం

టేకాఫ్‌ సెట్టింగుల్లో లోపం, పైలట్‌ తప్పిదమే కారణం?

దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ (వీటీ–ఏఎన్‌బీ) 171 విమాన ప్రమాదానికి ఇంజన్‌ వైఫల్యమే కారణమై ఉంటుందని వైమానిక రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పెను ప్రమాదాన్ని సూచిస్తూ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు పైలట్‌ చేసిన మేడే కాల్‌లోనూ, ప్రమాద వీడియోల్లోనూ విమానం ఇంజన్‌ శబ్దం అసలు విన్పించమే లేదు. 

దాన్నిబట్టి విమానం అప్పటికే పూర్తిగా థ్రస్ట్‌ (ఎగిరేందుకు అవసరమైన వేగం) పూర్తిగా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు. పక్షులు ఢీకొట్టడం వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో పక్షుల బెడద ఎక్కువే. అయితే బోయింగ్‌లో అత్యాధునికమైన ఈ శ్రేణి విమానాల్లో రెండు అత్యంత శక్తిమంతమైన ఇంజన్లుంటాయి. ఒకటి అనుకోకుండా ఫెయిలైనా రెండో ఇంజన్‌ సాయంతో విమానం సునాయాసంగా ఎగరగలదు.

 దాన్ని బట్టి రెండు ఇంజన్లూ విఫలమై ఉంటాయని అనుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 10 లక్షల ప్రయాణాలకు కేవలం ఒకసారి మాత్రమే అలా జరిగే ఆస్కారముంటుంది! ఇంధన కల్తీ, యాంత్రిక వైఫల్యం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కానీ బోయింగ్‌ 787లో వాడేది అత్యంత శక్తిమంతమైన జనరల్‌ మోటార్స్‌ కంపెనీ తాలూకు జీఈఎన్‌ఎక్స్‌ ఇంజన్లు. అవి అత్యంత విశ్వసనీయమైనవి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణం పెద్ద పజిల్‌గా మారింది. బ్లాక్‌బాక్స్‌ డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే దీనిపై స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. వారి విశ్లేషణ ప్రకారం ప్రమాద కారణాలు ఏమై ఉండొచ్చంటే...

టేకాఫ్‌ సెట్టింగుల్లో లోపం
విమానం టేకాఫ్‌ కాగానే లాండింగ్‌ గేర్‌ మూసుకోవాలి. సురక్షితమైన ఎత్తుకు చేరేదాకా రెండు ఫ్లాప్‌లూ (రెక్కల వెనక భాగం) విచ్చుకుని ఉండాలి. అప్పుడే విమానానికి ఎగిరేందుకు అవసరమైన శక్తి, ఊపు లభిస్తాయి. వీటన్నింటినీ టేకాఫ్‌ సెట్టింగులుగా పిలుస్తారు. ఇకగురువారం మధ్యాహ్నం ప్రమాద సమయంలో అహ్మదాబాద్‌లో ఏకంగా 43 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో వాయుసాంద్రత తక్కువగా ఉంది. 

అలాంటప్పుడు లాండింగ్‌ గేర్, ఫ్లాప్‌లు అత్యంత కచ్చితత్వంతో పని చేయడం చాలా కీలకం. కానీ ఏఐ171 విమానం గేర్‌ తెరుచుకునే ఉండగా ఫ్లాప్‌లు మూసుకుపోయాయి. ఇది పెను ప్రమాదానికి దారితీసే అసాధారణ పరిస్థితి. దీనివల్ల పైకెగిరేందుకు కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది. పైగా అవసరమైన థ్రస్ట్‌ లభించకుండానే పైలట్‌ టేకాఫ్‌కు ప్రయత్నించి ఉంటాడంటున్నారు. ఇలా ఫ్లాప్‌లు వెంటనే ముడుచుకుపోవడం వల్లే 2008లో స్పాన్‌ఎయిర్‌ విమానం కుప్పకూలింది.

సరిపోని థ్రస్ట్‌ 
బోయింగ్‌ ఇంజన్లు శక్తిమంతమైనవే అయినా విమానం బరువు, రన్‌వే పొడవు, ఉష్ణోగ్రత తదితరాల ఆధారంగా టేకాఫ్‌కు నిర్దిష్ట థ్రస్ట్‌ సెటింగ్‌లు అవసరమవుతాయి. 43 డిగ్రీల ఎండ ఉన్నందున ఇంజన్‌ సామర్థ్యం సహజంగానే కాస్త తగ్గుతుంది. అలాంటప్పుడు టేకాఫ్‌కు మామూలు కంటే అధిక థ్రస్ట్‌ తప్పనిసరి. కానీ ఏఐ171 పైలట్‌ రొటేషన్‌ స్పీడ్‌ను పొరపాటుగా లెక్కించి తక్కువ థ్రస్ట్‌ ప్రయోగించి ఉండొచ్చు. 241 మంది ప్రయాణికులు, భారీ లగేజీ, ఏకంగా 1.25 లక్షల లీటర్ల ఇంధన బరువు దీనికి తోడై విమానం సజావుగా ఎగరలేకపోయి ఉంటుంది.

లాండింగ్‌ గేర్‌ వైఫల్యం
ప్రమాద సమయంలో ఏఐ171 విమానం లాండింగ్‌ గేర్‌ తెరుచుకునే ఉంది. ఇది డ్రాగ్‌కు దారితీస్తుంది. దాంతో విమానం సజావుగా ఎగరలేదు. అందుకే టేకాఫ్‌ అయ్యాక క్షణాల్లోనే గేర్‌ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ తొలుత దాదాపుగా మూసుకున్న ఏఐ171 లాండింగ్‌ గేర్‌ ఆ వెంటనే బయటికొస్తూ కన్పించింది. బహుశా విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన థ్రస్ట్‌ లభించడం లేదని అర్థమై ఎమర్జెన్సీ లాండింగ్‌కు వీలుగా పైలట్‌ ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం ఉదంతంలో ఏదో ఒక దశలో పైలట్‌ లోపం కచ్చితంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి లోపాలను సునాయాసంగా అధిగమించే అత్యాధునిక సాంకేతికత 787 సొంతం. ఇక్కడే పైలట్‌ మానవ తప్పిదం చోటుచేసుకుని ఉంటుందంటున్నారు.

విద్రోహ కోణం
ఉగ్రవాదులో, దేశ వ్యతిరేక శక్తులో ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేయడం. కానీ ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం,సాక్ష్యాలను బట్టి ఇందుకు అవకాశాలు తక్కువే.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
 
Advertisement
Advertisement