
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు ధ్వంసమయ్యాయి. ఛండీగఢ్-కులు-మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రధానంగా ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతానికి పండ్లు, కూరగాయలు తీసుకెళ్తున్న వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. హైవేపై చిన్న వాహనాలకు అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ.. భారీ ట్రక్కులను నిలిపివేశారు. ఆపిల్, టమాటా, ఇతర కూరగాయల లోడ్లు పాడవుతున్నాయని ట్రక్కు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రక్కు లోడ్ విలువ లక్షల్లో ఉంటుందని డ్రైవర్లు చెబుతున్నారు.
మండి-కుల్లు మధ్యలో కొండచరియల విరిగి పడటంతో సహాయక పనులు చేపట్టారు. క్లియరెన్స్ పనులు కారణంగా ట్రాఫిక్‌కు ఆలస్యమవుతోంది. బియాస్ నది ఉధృతంగా ప్రవహించడం వల్ల జాతీయ రహదారిలో పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. మరమ్మతులు కొనసాగుతున్నాయి. కుల్లు ప్రాంతంలోని రామశిల సమీపంలో వరదల ప్రభావంతో ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. మనాలి ఒక వైపు నుండి ఇతర ప్రాంతాలతో ఉన్న రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపొయాయి.
50-km Traffic Jam On Chandigarh-Kullu Highway, Hundreds Of Trucks Stuck
apples alone estimated at more than Rs 50 crore stuck in transit.#HimachalPradesh pic.twitter.com/6CCgiRIyus— Sidharth Shukla (@sidhshuk) August 28, 2025
మంగళవారం సాయంత్రం నుండి హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వందలాది రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటివరకు, భారీ వర్షాలు, వరదలు కారణంగా సుమారుగా 158 మంది మరణించగా.. 38 మంది గల్లంతయ్యారు.. రూ. 2,623 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.