విద్యా ప్రమాణాల మెరుగే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాల మెరుగే లక్ష్యం

Jun 20 2026 12:01 PM | Updated on Jun 20 2026 12:01 PM

నారాయణపేట: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని.. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల నాణ్యమైన విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి విద్యా సమీక్షకు ఆమె హాజరై ఎఫ్‌ఎల్‌ఎన్‌, బడిబాట, విద్యార్థుల నమోదు, డిజిటల్‌ లెర్నింగ్‌, అపార్‌, యూ డైస్‌, వైఓసీ, ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు, మధ్యాహ్న భోజన పథకం, పాఠ్య పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై చర్చించి మాట్లాడారు. ప్రతి పాఠశాలలో వెనకబడిని విద్యార్థులను గుర్తించి రోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. 1, 2 తరగతుల విద్యార్థులు చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు సాధించేలా ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. డ్రాప్‌ అవుట్‌ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించి హాజరును నిర్ధారించాలని ఆదేశించారు. శనివారం జరిగే తల్లిదండ్రుల సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర, డిస్ట్రిక్ట్‌ మానిటరింగ్‌ ర్యాంకింగ్‌లో జిల్లా 21వ స్థానంలో ఉందని.. మెరుగైన పనితీరుతో జాతీయ ఫర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇన్‌డెక్స్‌ (పీజీఐ)లో ఉత్తమ స్థానం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఖాన్‌ అకాడమీ, తెలంగాణ ఎడ్యుకేషన్‌ యాప్‌, దీక్షావేదిక వంటి డిజిటల్‌ విద్యా వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఉపాధ్యాయులకు అవసరమైన ప్రత్యేక శిక్షణలు నిర్వహించాలని అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు నమోదులో ధన్వాడ, మాగనూర్‌ మండలాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని.. హాజరు నమోదు చేయని 40 మంది ఉపాధ్యాయులపై వెంటనే నివే దిక సమర్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి పాఠ్య, రాత పుస్తకాలు, వర్క్‌బుక్స్‌ సకాలంలో అందించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ అమలును నిరంతర పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి డా. ఎం.గోవిందరాజు, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారులు, సెక్టోరల్‌ అధికారులు, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

పాఠశాలల ఆకస్మిక తనిఖీ..

ఊట్కూర్‌: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలు, శ్రీరాంనగర్‌ ప్రాథమిక, తిప్రాస్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలను కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. తిప్రాస్‌పల్లి పాఠశాలలో లైబ్రరీ, మధ్యాహ్న భోజనానికి వినియోగించే నిత్యావసర సరుకులను తనిఖీ చేశారు. మెనూ పాటించకపోవడంపై వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాంనగర్‌ పాఠశాలలో బియ్యంలో పురుగులను గుర్తించి బస్తాలను తిప్పి పంపించి వేరే బియ్యాన్ని తెప్పించుకోవాలని హెచ్‌ఎంకు సూచించారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరాయని సర్పంచ్‌ రేణుక భరత్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకరాగా.. పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలను పంపించాలని ఎంపీడీఓ కిశోర్‌కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎంపీడీఓ కిశోర్‌కుమార్‌, ఉప సర్పంచ్‌ రమేశ్‌, ఆర్‌ఐ కృష్ణారెడ్డి ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement