యూరియా యాప్‌ సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యూరియా యాప్‌ సద్వినియోగం చేసుకోవాలి

Jun 20 2026 12:01 PM | Updated on Jun 20 2026 12:01 PM

మాగనూర్‌: రైతులు యాప్‌ ద్వారా ఇంటి నుంచే యూరియా బుక్‌ చేసుకునే సౌకర్యం వ్యవసాయశాఖ కల్పించిందని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ కోరారు. శుక్రవారం మాగనూరు మండలం మాగనూర్‌, కొత్తపల్లి, కృష్ణా మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అవసరాలకు సరిపడా అన్నిరకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, సకాలంలో యూరియాను బుక్‌ చేసుకొని పంటలకు అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని సూచించారు. డీలర్లు ఎరువులు, విత్తనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని ఆదేశించారు. అలాగే రైతులకు బిల్లు లేదా రసీదు అందజేయాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్‌ ఉన్నారు.

ఏబీవీపీ నాయకుల ధర్నా

నారాయణపేట ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలో ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేల పాఠశాలలు మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం సరికాదని.. వెంబడే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ నగర్‌ కార్యదర్శి సతీష్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని డీఈఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నారాయణపేటశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల ఆర్థిక దోపిడీకి ప్రభుత్వం కొమ్ము కాస్తోందని.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తాననడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకొని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో విచ్ఛలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని కోరారు. అదేవిధంగా ఆయా పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టులతో పాటు ఉపాధ్యాయ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని.. విద్యార్థులకు యూనిఫామ్స్‌ త్వరగా అందించాలని సూచించారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో తక్షణమే అల్పాహార పథకం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఇంతియాజ్‌, శివ, వినయ్‌, చరణ్‌, వివేకానంద, తరుణ్‌, ఓంకార్‌, విష్ణు, అభి తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్‌ విద్యపై అవగాహన

నారాయణపేట (కోస్గి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు అవసరమైన డిజిటల్‌ విద్య, సాంకేతికతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో అన్నా–అక్కా మెంటర్‌షిప్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు ఏఐ, డిజిటల్‌ లెర్నింగ్‌ అంశాలపై పాలమూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మాస్టర్‌ ట్రైనర్‌ గౌరీప్రసాద్‌ అవగాహన కల్పించారు. విద్యారంగంలో ఏఐ ప్రాధాన్యం, డిజిటల్‌ బోధన సాధనాల వినియోగం, ఆధునిక తరగతిగది బోధన పద్ధతులను వివరించారు. సాంకెతిక పరిజ్ఞానం విద్యారంగంలో సమర్థవంతంగా వినియోగించుకునేందుకు దోహదపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారులు ప్రవీణ, రాజశేఖర్‌, ఉపాద్యాయ బృందం పాల్గొన్నారు.

ధాన్యం @ రూ.2,708

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,708, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటాకు గరిష్టంగా రూ.2086, కనిష్టంగా రూ.1,710 చొప్పున పలికాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement