నకిలీ విత్తనాలతో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలతో జాగ్రత్త

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

నారాయణపేట: సరైన సమయం, నాణ్యమైన విత్తనం, ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తే వ్యవసాయంలో ఆశించిన దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్‌ అన్నారు. మంగళవారం ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఫోన్‌–ఇన్‌ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లాలోని పలువురు రైతులు అడిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. వానాకాలం పంటల సాగులో రైతులు ఆచీతూచి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నాయని తొందరపడి విత్తనాలు వేయొద్దని.. నేలలో తగినంత తేమ నిల్వ ఉన్న తర్వాతే నాటాలని సూచించారు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, సేంద్రియ సాగు, రసాయన ఎరువుల సమతుల్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

ప్రశ్న: సేంద్రియ వ్యవసాయం ఏ విధంగా చేయాలి?

– మహేష్‌, మందిపల్లి (మాగనూర్‌)

డీఏఓ: సేంద్రియ సాగు అంటే కేవలం రసాయన ఎరువులు వినియోగించకుండా చేయడం మాత్రమే కాదు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ సహజ వనరులను వినియోగించి పంటలు సాగు చేయడం. పశువు ల ఎరువు, వర్మీ కంపోస్ట్‌, జీవామృతం, ఘన జీవామృతం, ఆకుపచ్చ ఎరువులను వినియోగించాలి.

ప్రశ్న: సేంద్రియ ఎరువులు ఏ విధంగా

వినియోగించాలి?

– నర్సింహ, మాగనూర్‌

డీఏఓ: సేంద్రియ ఎరువులు భూమిలో కలిసేలా దుక్కి సమయంలో వేయాలి. ఎకరాకు 2 నుంచి 4 టన్నుల వరకు బాగా కుళ్లిన పశువుల ఎరువును వేయడం మంచిది. పిల్లిపెసర, జీనుగ విత్తనాలు వేసి 45 రోజుల తర్వాత భూమిలో కలిసేలా కలియదున్నాలి. వర్మీ కంపోస్ట్‌ను మొక్కల ఎదుగుదల దశలో వినియోగించవచ్చు.

ప్రశ్న: నకిలీ పత్తి విత్తనాలు గుర్తించడం ఎలా?

– చంద్రశేఖర్‌, భూనేడ్‌

డీఏఓ: ప్రస్తుతం మార్కెట్‌లో నకిలీ పత్తి విత్తనాల బెడద అధికంగా ఉంది. రైతులు గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలి. ప్యాకెట్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి బ్యాచ్‌ నంబర్‌, లాట్‌ నంబర్‌, గడువు తేదీ, ధ్రువీకరణ ట్యాగ్‌ పరిశీలించాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకొని భద్రపర్చుకోవాలి.

ప్రశ్న: విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి?

– నర్సింహులు, దామరగిద్ద

డీఏఓ: విత్తన శుద్ధి అనేది పంటల ఆరోగ్యానికి తొలి రక్షణ కవచం. శిలీంధ్రాలు, బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధులను నివారించేందుకు విత్తే ముందు ట్రైకోడెర్మా లేదా వ్యవసాయశాఖ సూచించిన శిలీంధ్రనాశక మందులతో శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన విత్తనాలను నీడలో ఆరబెట్టి వెంటనే విత్తాలి.

ప్రశ్న: అధిక వర్షాలు కురిస్తే ఏం చేయాలి?

– రాజు, మరికల్‌

డీఏఓ: పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే కాల్వలు ఏర్పాటు చేయాలి. పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల పంటల్లో నీరు నిల్వ ఉంటే వేరుకుళ్లు, తెగుళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వర్షం తగ్గిన తర్వాత అవసరమైతే సూక్ష్మపోషకాలు, శిలీంధ్రనాశక మందులు వినియోగించాలి.

ప్రశ్న: వానాకాలం సాగుకు అనువైన సన్నరకాల వరి వంగడాలు ఏవి?

– శంకర్‌, ధన్వాడ

డీఏఓ: విత్తనం మంచిదైతే పంట దిగుబడి అధికంగా వస్తుంది. నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలనే ఎంపిక చేసుకోవాలి. తెలంగాణ సోనా 15048, కాటన్‌న్‌దొర సన్నాలు కేఎన్‌ఎం 118, బీపీటీ–5204 (సాంబా మసూరి), వరంగల్‌ మసూరి జేఎల్‌ఎం–102, ఎంటీయూ–1010, ఎంటీయూ–1061, ఎంటీయూ–1273 రకాలు వేసుకోవచ్చు.

ప్రశ్న: కంది పంటకు అనువైన విత్తన రకాలు?

– వీరేష్‌, ఊట్కూర్‌

డీఏఓ: వర్షాధార ప్రాంతాలు, ఎర్ర, నల్ల నేలల్లో కంది ప్రధాన పంటగా సాగు చేస్తారు. రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన, ధ్రువీకరించిన రకాలను ఎంచుకోవాలి. ఆశ–87119, పీఆర్‌జీ–176, పీఆర్‌జీ–158, డబ్ల్యూఆర్‌జీ–65, ఎల్‌ఆర్‌జీ–41, టీఎస్‌–3ఆర్‌, టీఎస్‌–480 కంది విత్తనాలు వేసుకోవచ్చు.

ప్రశ్న: బీటీ–3 పత్తి విత్తనాలు గుర్తించడం ఏలా?

– వెంకటయ్య, రైతు, మరికల్‌

డీఏఓ: బీటీ–3 పత్తి విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. విత్తన ప్యాకెట్‌పై ‘ఆఎ–ఐఐఐ‘, ‘ఆఖీ–3‘, ‘హెర్బిసైడ్‌ టాలరెంట్‌ (ఏఖీ) కాటన్‌‘ వంటి పదాలు ఉంటే అనుమానించాలి. ప్రభుత్వం అనుమతించిన బీటీ–2 విత్తనాలకే అధికారిక ట్యాగ్‌లు, ధ్రువీకరణ వివరాలు ఉంటాయి. బీటీ–3 విత్తనాలు సాగు చేస్తే పంట నాణ్యత, దిగుబడి ఉండదు.

‘సాక్షి’ ఫోన్‌–ఇన్‌లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్‌

అదును చూసి విత్తు విత్తాలి

శాసీ్త్రయ సాగుతో అధిక దిగుబడులు

నాసిరకం, బీటీ–3 పత్తి విత్తనాలతో

అప్రమత్తంగా ఉండాలి

ప్రశ్న: డీఏపీ దొరకకపోతే ఎలాంటి ఎరువులు వాడాలి?

– సురేష్‌, దామరగిద్ద

డీఏఓ: డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం పంట, నేల సారం, నేల పరీక్ష ఫలితాల ఆధారంగా నిర్ణయించాలి. సాధారణంగా రైతులు ఎకరాకు 40 కిలోల నుంచి 60 కిలోల డీఏపీ లేదా పంటకు సిఫారసు చేసిన మోతాదులో కాంప్లెక్స్‌ ఎరువులు (20:20:0:13, 28:28:0, 24:24:0 ) వినియోగించాలి. డీఏపీ ద్వారా మొక్కలకు నత్రజని, భాస్వరం లభిస్తాయి. అదే పోషకాలను ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల ద్వారా కూడా అందించవచ్చు. కాబట్టి డీఏపీ లేకపోయినా పంట ఎదుగుదలపై పెద్దగా ప్రభావం ఉండదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement