ఆ మాట వింటే.. ఫీజులు ఎగరాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

ఆ మాట వింటే.. ఫీజులు ఎగరాల్సిందే!

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా..

ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి ప్రైవేటు పాఠశాల అక్రమ వసూళ్లున అడ్డుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. – ప్రశాంత్‌,

ఎస్‌ఎఫ్‌ఐ, సంఘం రాష్ట్ర నాయకుడు

చర్యలు తీసుకుంటాం..

ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితోపాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్‌ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్‌ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి,

డీఈఓ, మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సామాజిక సేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రభుత్వ పుస్తకాలకు మంగళం..

ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవేటు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్‌ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్‌ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్‌ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్‌ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పున రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్‌ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు.

ఐఐటీ, నీట్‌కు అదనం..

పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్‌ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్‌కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐటీ, నీట్‌ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు

ఎల్‌కేజీ, యూకేజీ, 1వ తరగతికి రూ.35 వేల నుంచి 50 వేల వరకు..

స్కూల్‌స్థాయిలో ఐఐటీ, నీట్‌

ఫౌండేషన్‌ కోర్సుల పేరిట అదనం

టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం,బూట్ల పేరిట నిలువు దోపిడీ

పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాపట్టింపులేని విద్యాధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement