‘డైవర్షన్‌’లోనే రాజోళి బండ | - | Sakshi
Sakshi News home page

‘డైవర్షన్‌’లోనే రాజోళి బండ

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం..

ఆర్డీఎస్‌ సమస్యకు లభించని

శాశ్వత పరిష్కారం

నేటికీ అసంపూర్తిగానే

ప్యాకేజీ–1, 2 పనులు

ఏళ్ల తరబడి తేలని

నడిగడ్డ రైతుల నీటివాటా

తాజాగా హెడ్‌వర్క్స్‌ను సందర్శించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌

30 టీఎంసీల రిజర్వాయర్‌

నిర్మించాలని రైతుల వినతి

గద్వాల: కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన రాజోళి బండ డైవర్షన్‌ పథకాన్ని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ సుబ్రాన్షు బిశ్వాస్‌ మంగళవారం సందర్శించారు. హెడ్‌వర్క్స్‌ వద్ద నిర్మించిన ఆనకట్ట, స్లూయిస్‌, ప్రధాన కాల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్‌ మాజీ చైర్మన్‌ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు చైర్మన్‌ను కలిశారు. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఆర్డీఎస్‌ పరిధిలో అలంపూర్‌కు జరుగుతున్న అన్యాయాన్ని సవివరంగా వివరించారు. అలాగే హెడ్‌వర్క్స్‌ వద్ద రెండు దశాబ్దాల కిందట చేపట్టిన ప్యాకేజీ–1, 2 పనులు పెండింగ్‌లో కొనసాగుతున్న వైనాన్ని చైర్మన్‌ దృష్టికి తెచ్చారు. ఆర్డీఎస్‌కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్‌వర్క్స్‌ పరిధిలో 30 టీఎంసీల సామర్థ్యంతో కూడిన జలాశయం, అదేవిధంగా రాజోళి మండల పరిధిలో నిర్మించతలపెట్టిన మల్లమ్మకుంట రిజర్వాయర్‌ను పూర్తిచేయాలని చైర్మన్‌కు విన్నవించారు.

ఇదీ ఆర్డీఎస్‌ నేపథ్యం..

నిజాం హయాంలో అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్ణాటకలోని రాజోళి వద్ద హెడ్‌వర్క్స్‌ నిర్మాణం చేపట్టారు. భాషాప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన తర్వాత ఆర్డీఎస్‌కు నీటి కష్టాలు మొదలయ్యాయి. మనకు రావాల్సిన 15 టీఎంసీల నీటివాటా పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దీనికి హెడ్‌వర్క్స్‌ నిర్మాణం, మనవైపు నీరు రావాల్సిన ప్రధానకాల్వ మొత్తం కర్ణాటక పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ఫలితంగా నీటివాటా కేటాయింపుల అన్యాయం జరుగుతోంది. ప్రధానంగా ఆర్డీఎస్‌ ఆనకట్ట స్లూయిస్‌ నిర్మాణాలు ఏపీకి సమీపంలో ఉన్నాయి. దీంతో మనకు రావాల్సిన నీటివాటాను ఏపీ రైతులు తరలించుకువెళ్లడంతో ఆర్డీఎస్‌ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఆర్డీఎస్‌కు శాశ్వత పరిష్కారం చూపెడుతూ అిప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్లూయిస్‌ రంద్రాలను మూసివేయడంతోపాటు ఆనకట్ట, ప్రధాన కాల్వల మరమ్మతుకు నిధులు మంజూరు చేశారు. దీంతో ఆర్డీఎస్‌కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న తరుణంలో మాజీ సీఎం వైఎస్సార్‌ అకాల మరణంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆనకట్ట వద్ద రెండు ప్యాకేజీ పనులు నేటికీ అసంపూర్తిగానే కొనసాగుతుండగా.. మిగిలిన పనులు సైతం తూతూమంత్రంగా చేపట్టారు. దీంతో సుమారు ఐదు దశాబ్దాలుగా కేవలం 50వేల లోపు ఆయకట్టుకే సాగునీరు అందిస్తున్న పరిస్థితి నెలకొంది.

● తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆర్డీఎస్‌ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాజోళి వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టారు. వరద సమయంలో తుంగభద్ర నది నీటిని తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి నేరుగా ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వలకు ఎత్తిపోసి 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. అయితే వానాకాలంలో వరద ఉన్న సమయంలో మాత్రమే సాగునీరు అందుతుండగా.. మిగిలిన రబీ సీజన్‌లో క్రాప్‌హాలిడే ప్రకటిస్తున్నారు.

కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ సుబ్రాన్షు బిశ్వాస్‌తో కూడిన అధికారుల బృందం మంగళవారం కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్‌ హెడ్‌వర్క్స్‌ను సందర్శించింది. ఆనకట్ట, స్లూయిస్‌ నిర్మాణాలు, ప్యాకేజీ–1, 2 పరిధిలో అసంపూర్తి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్‌ మాజీ చైర్మన్‌ సీతారామిరెడ్డి, ఆయకట్టుదారులతో కలిసి కేఆర్‌ఎంబీ చైర్మన్‌ సుబ్రాన్షు బిశ్వాస్‌ను కలిసి.. ఆర్డీఎస్‌కు జరుగుతున్న అన్యాయాలను క్షుణ్ణంగా వివరించారు. ఆర్డీఎస్‌కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్‌వర్క్స్‌ ప్రాంతంలో 30 టీఎంసీల రిజర్వాయర్‌, అలాగే రాజోళి వద్ద మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణాలు పూర్తిచేయాలని చైర్మన్‌కు విన్నవించారు. ‘‘ఆర్డీఎస్‌కు ఉమ్మడి ఏపీలో దశాబ్దాలుగా అన్యాయం జరిగింది. దీనిపై తాను రైతులతో కలిసి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం చూపాలంటే 30 టీఎంసీల హెడ్‌వర్క్స్‌ వద్ద రిజర్వాయర్‌, మల్లమ్మకుంట రిజర్వాయర్‌, సుమారు 75 ఏళ్ల కిందట నిర్మించిన ఆర్డీఎస్‌ ఆనకట్టను పునర్నిర్మించాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు.’’ అని సీతారామిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement