ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

నారాయణపేట రూరల్‌: విద్యా ర్థులు ఇష్టపడి చదివి జీవిత లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక సూచించారు. మంగళవారం మండలంలోని జాజాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఇష్టంతో చదవాలని, బట్టి పట్టే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. లెక్కలు సులువుగా ఎలా చేయాలో విద్యార్థులకు చేసి చూపించారు. పదోతరగతి పునాది లాంటిదని.. రాబోయే పదేళ్లలో ఎలా ఉండాలో నోట్‌ బుక్‌లో రాసుకొని రోజూ దానిని చూస్తూ తగిన ప్రణాళికతో సాధన చేయాలన్నారు. పదోతరగతిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉండటం సంతోషంగా ఉందని.. అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం కావాలన్నారు.

టాపర్‌కు ప్రత్యేక బహుమతి..

ఈ విద్యా సంవత్సరం పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలవాలని, జాజాపూర్‌ పాఠశాల నుంచి కూడా ట్రిపుల్‌ ఐటీకి విద్యార్థులు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. పదోతరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన వారికి తన తరఫున ప్రత్యేక బహుమతి ఇస్తానని కలెక్టర్‌ ప్రకటించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు అందించారు. పాఠశాల ప్రయోగశాల, గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఆమె వెంట జిల్లా విద్యాధికారి గోవిందరాజు, ఎంఈఓ బాలాజీ, జీహెచ్‌ఎం భారతి, డీఎస్‌ఓ భానుప్రకాష్‌, తపస్‌ జిల్లా అధ్యక్షుడు నర్సింహ, ఉపాధ్యాయులు మధుసూదన్‌రావు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement