గుప్పుమంటున్న గంజాయి
యువతే లక్ష్యంగా అమ్మకాలు
విస్తృత దాడులు
నారాయణపేట: జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నారు. యువతే లక్ష్యంగా వీరు అమ్మకాలు చేపడుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి జిల్లాకు రైళ్లలో గుట్టుగా గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గంజాయి తరలింపు, వినియోగాన్ని అరికట్టేందుకు ఇటు పోలీసులు, అటు ఎకై ్సజ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి విక్రయదారులను పట్టుకుంటున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. దీంతో యువతతో పాటు మైనర్లు గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. గంజాయి, డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలని ప్రభుత్వ సంకల్పంతో కలెక్టర్ సిక్తాపట్నాయక్ దిశానిర్ధేశంతో ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు ఇటీవల విస్తృత దాడులు చేశారు. పలువురిని పట్టుకోవడంతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని 14 కేసులు నమోదు చేశారు.
ప్రత్యేక టీంలతో సరిహద్దులో నిఘా
జిల్లాకు సరిహద్దులో కర్ణాటక ఉండడంతో అటు నుంచే గంజాయి తరలిస్తున్నారు. దీంతో ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన ఎస్పీ వినిత్ గంజాయి విక్రయాల అడ్డుకట్టపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు ఓ ప్రత్యేక టీంను ఏర్పాటుచేశారు. జిల్లా పరిధిలోని మక్తల్‌లో కృష్ణా చెక్‌పోస్టు, నారాయణపేటలో జలాల్‌పూర్ చెక్‌పోస్టు, దామరగిద్దలో కానుకుర్తి చెక్‌పోస్టు, ఊట్కూర్‌లో సంస్థపూర్ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అయినా సరిహద్దులు దాటి తెలంగాణలోకి గంజాయి వస్తుండడంతో పోలీసులకు మరింత సవాల్‌గా మారింది. దామరగిద్ద మండలంలోని సజానాపూర్, మాగనూర్ మండలంలోని ఉజ్జెలి, కృష్ణా మండలంలోని చేగుంటా, కున్షి, హిందూపూర్, నారాయణపేట మండలంలోని ఎక్లాస్‌పూర్, ఊట్కూర్ సమీపంలోని ఇడ్లూర్, కొల్లూర్ గ్రామాలు సైతం కర్ణాటకకు సరిహద్దులో ఉన్నాయి. ఆ మార్గాల గుండా గంజాయిని తీసుకువస్తుండడంతో పోలీసులు నిఘా పెంచారు. ఇదిలాఉండగా, ధన్వాడకు అటు హైదరాబాద్‌లోని దూల్‌పేట నుంచి, ఇటు ముంబాయి నుంచి గంజాయి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మండలంలోని పలు తండాల నుంచి ముంబాయికి వలస వెళ్లే వారు తిరిగి తమ ప్రాంతాలకు వచ్చే సమయంలో అక్కడ గంజాయికి అలవాటు పడిన యువత తమ వెంట గంజాయి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
గంజాయి కేరాఫ్ యాద్గీర్, షోలాపూర్
కర్ణాటకలోని యాద్గీర్, మహారాష్ట్రలోని షోలాపూర్ గంజాయికు కేరాఫ్‌గా దందా కొనసాగుతున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో పది మంది పట్టుబడిన వారిలో షోలాపూర్, యాద్గీర్‌కు చెందిన వారు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండే అశోక్‌నగర్‌లో ఉండే ఓ యువకుడు గత రెండేళ్లుగా గంజాయి వ్యాపారం చేసి ఇటీవల పట్టుబడడం.. తీగలాగితే డొంక కదలింది. గంజాయి రాకేట్‌లోని మరో తొమ్మిది మందిని పోలీసులు పట్టుకొని జిల్లా ఎస్పీతో శభాష్ అనిపించుకున్నారు.
కర్ణాటకలోని యాద్గీర్, మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి గుట్టుగా తరలింపు
ఎకై ్సజ్, పోలీస్‌శాఖ ప్రత్యేక నిఘా.. విస్తృత దాడులు
పదుల సంఖ్యలో కేసులు నమోదు
జిల్లాలో ఎకై ్సజ్‌శాఖ దాడుల్లో పలు గంజాయి కేసులు నమోదుఅయ్యాయి. కృష్ణా మండలంలోని కున్సిలో ఇద్దరిపై, మూరారిదొడ్డిలో ఒకరు, దామరగిద్ద మండలంలో ఒకరిపై కేసులు నమోదు అయ్యాయి. మాగనూర్ మండలంలోని కొత్తపల్లిలో ఒకరు, చందాపూర్‌లో మస్తీపూర్‌కు చెందిన వ్యక్తి, సింగారం చౌరస్తాలో గుర్మిట్కల్ తాలూకా గుంజనూర్‌కు చెందిన వ్యక్తి ఒకరు పట్టుబడ్డారు. అదే విధంగా పోలీసు శాఖ దాడుల్లో 8 కేసులు నమోదు అయ్యాయి. ఊట్కూర్ మండలంలోని ఎడవేళ్లిలో ఊట్కూర్ పీఎస్ పరిధిలో 400 గ్రాములు గంజాయి, గంజాయి మొక్కలు పట్టుబడడంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అలాగే, కృష్ణా మండలంలో 500 గ్రాముల గంజాయి ఒక ప్లాంట్ పట్టుబడడంతో ఒకరిపై, ధన్వాడ పీఎస్ పరిధిలో 50 గ్రాముల పట్టుబడడంతో ఒకరిపై కేసు నమోదు చేశారు. మక్తల్ పీఎస్ పరిధిలో 500 గ్రాముల గంజాయి పట్టుబడడంతో ముగ్గురిని అరెస్టు, మద్దూర్ పీఎస్ పరిధిలో 1.3 కేజీ డ్రై గంజాయి, 89 ప్లాంట్స్ పట్టుబడడంతో ఒకరిపై కేసు నమోదు అయింది. గత ఆగస్టు 15న ఊట్కూర్ శివారులో గంజాయి విక్రయిస్తూ 125 గ్రాములతో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. నవంబర్ 2 కృష్ణా పీఎస్ సరిహద్దులో చేపట్టిన పోలీసుల తనిఖీల్లో 12.4 కిలోల గంజాయి పట్టబడడం గమనార్హం.
గుప్పుమంటున్న గంజాయి


