అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం

Nov 10 2025 8:46 AM | Updated on Nov 10 2025 8:46 AM

అమ్రా

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం

ఈ లెక్కల ఆధారంగానే.. ఆరేళ్లలోనే 36కు పెరిగిన సంఖ్య.. పెద్ద పులులకు పుట్టినిల్లు.. వలంటీర్లను తీసుకుంటాం..

అతిపెద్ద టైగర్‌ రిజర్వు..

జనవరి 17 నుంచి 23 వరకు

కొనసాగనున్న ప్రక్రియ

ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం

స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల

నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఈ నెల 22తో ముగియనున్న

స్వీకరణ గడువు

అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్‌ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్‌ వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు.

ప్రతి వలంటీర్‌ అటవీ సిబ్బందితో కలిసి 7 రోజులపాటు అడవిలో కాలినడకన నడుస్తూ.. పులుల జాడలు, పాదముద్రలు, మల విసర్జితాలు, ఇతర అవశేషాలను సేకరించి జంతువుల గణన చేపడతారు. ఈ లెక్కల ఆధారంగానే భవిష్యత్‌లో పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో గణన జరుగుతుంది. ప్రతి బీట్‌కు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున లెక్కింపులో పాల్గొంటారు. అమ్రాబాద్‌ అభయారణ్యంలోని 11 రేంజ్‌ల పరిధిలో 220 బీట్లలో పులుల లెక్కింపునకు అటవీశాఖ సిబ్బంది 150 మందితోపాటు మరో 50 మంది వాచర్లు ఉన్నారు. వీరితోపాటు సుమారు 460 మంది వలంటీర్లు అవసరమవుతారు. ఈ నెల 4 నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. ఇప్పటి వరకు 700 పైగా వచ్చాయి. వీటిలో అర్హత మేరకు వలంటీర్లను తీసుకుంటారు.

దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్‌ 45వ స్థానంలో ఉండగా.. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్‌ రిజర్వు ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ.. బఫర్‌ జోన్‌. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల అడవులను అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంగా పరిగణిస్తారు. అమ్రాబాద్‌, మద్దిమడుగు, మన్ననూర్‌, దోమలపెంట, అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జునసాగర్‌ రేంజ్‌లను 270కి పైగా బీట్లుగా విభజించి గణన చేపడుతున్నారు. కెమెరా ట్రాప్‌ ద్వారా సేకరించిన ప్లగ్‌ మార్కులు, గుర్తులను అక్కడికక్కడే ఎకనామికల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పులుల మనుగడకు ఆవశ్యకతగా ఉండే శాఖాహార జంతువుల సంఖ్య పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనే వివరాల మేరకు పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటారు.

మ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో జీవవైవిధ్యంతోపాటు పులుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో వాటి సంతతి పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర కీలకం. ఒకప్పుడు కేవలం మూడు పులులకు నిలయంగా ఉన్న ఏటీఆర్‌లో ఇప్పుడు వాటి సంఖ్య 36కు పెరిగింది. 2017 వరకు కూడా పులుల సంఖ్య అరకొరగానే ఉండేది. అమ్రాబాద్‌ అభయారణ్యంలో కేవలం 10 పులులే ఉండేవి. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించి.. వాటి పరిరక్షణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఫలితంగా ఆరేళ్లలో అమ్రాబాద్‌లో పులుల సంఖ్య 36కు పెరిగింది.

ల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు పుట్టినిల్లుగా మారుతోంది. 200పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (ఏటీఆర్‌) ఉంది. ఇక్కడ ఆరేళ్లుగా పులుల సంతతి పెరుగుతోంది. 2017 లెక్కల ప్రకారం 6 పులులు ఉండగా.. 2024– 25 జూలై వరకు 36కు పెరిగింది. అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని పులి కూనలతో కలిసి సంచరిస్తున్న ఫరాహా ఎఫ్‌–6 ఆడపులి, ఫరాహా ఎఫ్‌–6, తారా ఎఫ్‌–7, భౌరమ్మ ఎఫ్‌–18, ఎఫ్‌–26, ఎఫ్‌–53 ఆడపులులు వాటి సంతతి పెంచేందుకు తోడ్పడటంతోపాటు నల్లమలలో జీవవైవిధ్యానికి పాటుపడుతున్నాయి.

ఈసారి పులులు, ఇతర జంతువుల గణన పకడ్బందీగా కొనసాగుతుంది. గతంలో అరకొర సిబ్బందితో చేపట్టగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అటవీ సిబ్బంది 150 మందితోపాటు సమర్థవంతంగా పనిచేసే 50 మంది వాచర్లు ఉన్నారు. అలాగే వలంటీర్ల కోసం ఆన్‌లైన్‌లో 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. అటవీ, పులులపై అవగాహన కలిగిన అర్హులు, పనితీరు మెరుగ్గా ఉన్న యువతను వలంటీర్లుగా తీసుకుంటాం. – రోహిత్‌ గోపిడి, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్‌

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం 
1
1/1

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement