
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
నారాయణపేట: జిల్లాలో ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువుల డీలర్లతో సమావేశమయ్యారు. ఇప్పటికే జిల్లాలో 80 శాతం ఎరువుల విక్రయాలు సాఫీగా సాగాయని, మరో పక్షం రోజుల పాటు కొనసాగే 20 శాతం ఎరువుల విక్రయాలు అలాగే ఉండాలన్నారు. ఎరువులు తప్పని సరిగా ఈ – పాస్ యంత్రం ద్వారానే అమ్మాలని, ఎరువులు రైతులందరికి అందుబాటులో ఉండేటట్లు చూడాలని, ఒకే రైతుకు ఎక్కువ మొత్తంలో అమ్మరాదని ఆదేశించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. డీలర్లు ఉన్న స్టాక్ ను సక్రమంగా విక్రయించాలని, ఇటీవల జిలాల్‌పూర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 34 బస్తాల యూరియాను పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సమావేశంలో డీఏఓ జాన్ సుధాకర్, ఏఓలు, ఏఈవోలు పాల్గొన్నారు.
జిల్లా సర్వే నివేదిక కమిటీ ఏర్పాటు
జిల్లా సర్వే నివేదిక కమిటీని కలెక్టర్ సిక్తా పట్నా యక్ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారాన్ని నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆమె ఆదేశించారు. ఆ సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా సర్వే నివేదికను రాష్ట్ర కాలుష్య మండలికి అందజేయాలని సూచించారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి
జిల్లాకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ప్రతిభచాటిన 52 మంది జిల్లా క్రీడాకారులను కలెక్టర్ శాలువా, మెమెంటోతో సన్మానించారు. ముందుగా కలెక్టరేట్‌లో ధ్యాన్ చంద్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పూల మాల వేసి నివాళులర్పించగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన విద్యార్థులు వివిధ క్రీడా పోటీలలో పాల్గొని జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి వెండి, బంగారు పతకాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలన్నారు. ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీవైఎస్‌ఓ వెంకటేష్ మాట్లాడారు. కార్యక్రమంలో పీజికల్ డైరెక్టర్లు సాయినాథ్, వెంకటప్ప, అనంతసేన,నరసింహులు రవికుమార్, స్వప్న, సౌమ్య, కోచ్‌లు రఘు, శ్రీనివాస్, హారిక, క్రీడాకారులు పాల్గొన్నారు.