
నిబద్ధతతో పనిచేస్తేనే ప్రగతి
● క్షేత్రస్థాయిలో సమస్యల
పరిష్కారానికి చొరవ చూపాలి
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆస్పీరేషన్ నర్వ బ్లాక్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. నర్వ మండలంలో రైతుల ఆదాయం పెంపు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పించే ప్రాజెక్టులు, నీటి సంరక్షణ పద్ధతులు, పాడి ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 3న నీతి అయోగ్ సీఈఓతో వీసీ ఉందని.. అంతలోగా వినూత్న ప్రాజెక్టు ప్రతిపాదనలను శాఖల వారీగా సంబంధిత అధికారులు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. 5న డీపీఆర్ పంపించాల్సి ఉంటుందన్నారు. ఇటీవలే నర్వ ఆస్పీరేషన్ బ్లాక్‌కు సంబంధించి నీతి అయోగ్ అవార్డు అందుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ముందుగా అసిస్టెంట్ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో కలెక్టర్ అమలుచేస్తున్న ఉత్తమ పద్ధతులను వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శైలేష్ కుమార్, హౌసింగ్ పీడీ శంకర్, డీఏఓ జాన్ సుధాకర్, పీఆర్ ఈఈ హీర్యానాయక్, డీఈఓ గోవిందరాజులు, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, మిషన్ భగీరథ డీఈ రంగారావు, డీపీఓ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి..
వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి.. సిబ్బంది హాజరు, మందుల స్టాక్ రిజిస్టర్లను చూశారు. ఓపీ, జనరల్ వార్డుల్లో వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి ఆవరణ, బెడ్స్ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
● ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 45 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.