
హైవేపై ప్రమాద ఘంటికలు
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారి–44పై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రెట్టింపు అవుతున్నాయి. ప్రమాదాల్లో మొదటి స్థానంలో కార్లు ఉంటే ఆ తర్వాత బస్సులు, ద్విచక్ర వాహనాలు ఉంటున్నాయి. వర్షంలో డ్రైవింగ్, నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ వంటి మూడు అంశాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నా యి. అయితే ఆయా ప్రమాదాల్లో 70 శాతానికి పైగా యువకులే మృత్యువాతపడుతున్నారు. నా లుగు వరుసల రహదారి వెంట వేసిన అనుబంధ, ఇతర అంతర్గత రోడ్లలో నిబంధనలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలాంటి రోడ్డునైనా సరే ప్రతి రెండేళ్లకోసారి మరమ్మతు చేయించాల్సి ఉన్నా ఆ దిశగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అద్దంలా మెరవాల్సిన నాలుగు లైన్ల రోడ్లు చాలా చోట్ల గుంతలు, ప్యాచ్‌లు, ఎగుడు దిగుడుగా ఉంటూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరోవైపు జాతీయ రహదారి–167పై కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఈ రోడ్డుపై జడ్చ ర్ల కల్వకుర్తి మధ్యలో, మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర మధ్యలో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
టాప్‌లో జడ్చర్ల..
జిల్లావ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో టాప్ ఐదు స్థానాల్లో నాలుగు జాతీయ రహదారిపై ఉన్న స్టేషన్స్ ఉండటం విశేషం. మూడేళ్లలో జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 127 మంది వాహనదారులు మృతి చెందగా.. మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 106, భూత్పూర్ 80, బాలానగర్ 47, రాజాపూర్ 45 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. అత్యల్పంగా నవాబ్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో 16 మంది, చిన్నచింతకుంటలో 17 మంది మృతి చెందారు.
ఇష్టారాజ్యంగా నిలిపివేత..
ఉమ్మడి జిల్లాలోని అన్ని రహదారులపై నిబంధనలు అమలు కావడం లేదు. రోడ్ల వెంట ఉండే దాబాల ముందు లెక్కకు మించి భారీ వాహనా లు, కార్లు, బైకులు ఆపుతున్నారు. అక్కడే భారీ వాహనాలకు రిపేర్లు, పంక్చర్లు చేసుకోవడమే కాకుండా భోజనం వండుకుంటున్నారు. దీంతో రోడ్డుపై వెళ్లేవారికి ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. రోడ్ల వెంట 24 గంటలు వాహనంలో తిరుగుతూ పర్యవేక్షించాల్సిన (హైవే పెట్రోలింగ్) అధికారులు, సిబ్బంది సక్రమంగా కనిపించడం లేదు. దీంతో రోడ్లపై వాహనదారులు వారికి సంబంధించిన భారీ వాహనాలను ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు.
బాధ్యత లేని యంత్రాంగం
జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలకు ఆర్టీఏ, పోలీస్ యంత్రాంగం, ఆర్‌అండ్‌బీ, ఎల్‌ఎన్‌టీ వారు ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. కేవలం రోడ్డు ప్రమాదాల వారోత్సవాలు జరిగినప్పుడు మాత్రమే తూతూమంత్రంగా వ్యవహరించి ఆ తర్వాత మిన్నంకుండిపోతున్నారు. జాతీయ రహదారిపై ఎక్కడ కూడా అవసరమైనా సూచిక బోర్డులు లేకపోవడంతో రాత్రి 7 నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై మలుపులు ఉన్న దగ్గర రేడియేషన్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
అడ్డాకుల మండల సమీపంలోని కాటవరం స్టేజీ వద్ద లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
జాతీయ రహదారిపైపెరుగుతున్న మరణాలు
మూడేళ్ల వ్యవధిలో 670 మందిమృత్యువాత
క్షతగాత్రులుగా మరో 1,243 మంది వాహనదారులు
రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్యలోనే అత్యధిక ఘటనలు