
కబ్జాల తీరు ఇది..
● నారాయణపేట కొండారెడ్డిపల్లి చెరువుకు పట్టణం మీదుగా వెళ్లే నాలా ఇరువైపులా కబ్జాకు గురైంది. పళ్లబురుజు, పరిమళగిరి లాంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
● కోస్గి ఎర్రగుంట చెరువు నాలా టీచర్స్ కాలనీ, విద్యానగర్‌తో, బృందావన్ కాలనీల్లో ఆక్రమణకు గురికావడంతో మూసాయినల్లి చెరువుకు వెళ్లాల్సిన నీరు పొంగి ఆయా కాలనీల్లోకి వస్తుంది.
● నారాయణపేట జిల్లాకు ముఖద్వారంగా ఉన్న మరికల్‌ను అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చింది. 37.39 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువు ఆయకట్టు 157 ఎకరాలు ఉంది. అయితే ఆనకట్ట కింద బఫర్ జోన్‌లో ఉన్న స్థలంలో ఇళ్లు, షెడ్లు, డబ్బాలు, ఇతర దుకాణాలను నిర్మించడంతో చెరువు నిండిన ప్రతీ సారి జాతీయ రహదారిపైకి నీరు రావడమే కాకుండా.. అక్కడ ఉన్న స్థానికుల ఇళ్లలోకి నీరుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ధర్మన్నకుంట, కనకల్ చెరువుల అలుగు నీరు వస్తే కాలనీలు ముంపునకు గురికావాల్సిన దుస్థితి నెలకొంది.
● మక్తల్‌లో మూడు ప్రధాన చెరువులు, ఐదు నీటి కుంటలు ఉండేవి. అందులో ఐదు కుంటలు స్థిరాస్తి వ్యాపారుల చేతిలోకి వెళ్లి ఉనికిని కోల్పోయాయి. ప్రధానంగా ఎల్లమ్మకుంట ఒకప్పుడు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు అది కాలనీలా మారిపోయింది. ఫలితంగా అంబేడ్కర్ నగర్, భరత్‌నగర్, బాపూజీనగర్ ప్రజలు తరచుగా ముంపునకు గురవుతున్నాయి. మరో ప్రధాన సాగునీటి వనరైన పెద్దచెరువు ఎఫ్‌టీఎల్ 162.25 ఎకరాలు కాగా.. ఎఫ్‌టీఎల్‌తో పాటు బఫర్ జోన్ సైతం ఆక్రమించారు. ఈ చెరువు అలుగు జాతీయ రహదారి నుంచి ప్రవహిస్తుంది. అక్కడ ఏకంగా వాణిజ్య సముదాయమే వచ్చేసింది. మిగతా స్థలాన్ని కొందరు చదును చేస్తున్నా పట్టించుకునే వారే లేరు. దీంతో పాటు తిరుమలయ్య చెరువు మూడు సర్వేనంబర్లతో 46.18 ఎకరాల ఎఫ్‌టీఎల్ ఉండగా.. చెరువులో మొత్తం 30 ఎకరాల విస్తీర్ణం వరకు వెంచర్లు వెలిశాయి. ఇటీవల కురిసిన వర్షానికి చెరువు నిండటంతో.. అందులో స్థలాలు కొన్న వినియోగదారులు లబోదిబోమంటున్నారు.