
ఎన్నాళ్లీ అవస్థలు..!
మరికల్: జిల్లాలోని అనేక చెరువులు, కుంటలు, పాటు కాల్వలు ఆక్రమణకు గురయ్యాయి. బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఫలితంగా వరద నీరు నివాసగృహాలు, రోడ్లపైకి చేరుతోంది. రోజుల తరబడి మునిగిన ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ బాధితులు కాలం వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. ఐదేళ్లుగా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటమునిగిన ఇళ్లు, రోడ్లపైకి చేరే వరదను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ తాత్కాలిక చర్యలు చేపడుతున్నారనే తప్ప.. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని నీటి వనరుల వద్ద ప్రత్యేకంగా సర్వే చేపట్టి.. బఫర్ జోన్లు గుర్తించారు. అయితే చెరువులు, గొలుసుకట్టు కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి అధికారులు నోటీసులు జారీ చేయడం లేదు. భారీ వర్షాలు కురిసి ఇళ్లు, రోడ్లపైకి వరద వచ్చినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. హైదరాబాద్ తరహాలో ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, 13 మండల కేంద్రాల్లో 890 చెరువులు, 235 కుంటలు ఉన్నాయి. వీటిలో నారాయణపేట, మక్తల్, కోస్గి, మరికల్ పట్టణాల్లోని ప్రధాన నీటివనరులు కబ్జాకు గురవుతున్నాయి. అసలు చెరువులు, కుంటలు లేకుండానే మాయం చేస్తున్నారు. ఈ ప్రభావంతో వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మితిమీరిన రాజకీయ జోక్యం, అధికారుల ఉదాసీనత, అవినీతి కారణంగా చెరువులు, కుంటలు యథేచ్ఛగా కబ్జాకు గురికావడం వర్షాల సమయంలో ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.
బఫర్ జోన్‌లో ఇళ్లు నిర్మిస్తే చర్యలు
జిల్లాలో చెరువుల కింద ఉన్న బఫర్ జోన్లను గుర్తించడం జరిగింది. అలాంటి బఫర్ జోన్‌లో నిర్మించిన ఇళ్లు అక్రమం అని తేలితే నోటీసులు జారీ చేస్తాం. భారీ వర్షాలతో కాలనీలు, రోడ్లపైకి వస్తున్న వరద ప్రవహంపై సమీక్షించడం జరిగింది. భవిష్యత్‌లో ఇలాంటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం.
– ప్రతాప్‌సింగ్, ఈఈ, ఇరిగేషన్‌శాఖ
చెరువులు పారినప్పుడల్లానీటమునుగుతున్న కాలనీలు
ఇళ్లు, రోడ్లపైకి చేరుతున్న వర్షపునీరు
చెరువుల ఆక్రమణతో ముప్పు
వరదల సమయంలోనే
అధికారుల హడావుడి
జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి