
సంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకోవాలి
నారాయణపేట క్రైం/కోస్గి: జిల్లాలో డీజేలకు స్వస్తి పలికి.. సంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమ వారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో డీజేలను నిషేధించడం జరిగిందన్నారు. అయినప్పటికీ కొందరు కావాలని డీజేలను వినియోగిస్తుండటంతో జిల్లా కేంద్రంలో 8 డీజే వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కర్ణాటక సరిహద్దు నుంచి జిల్లాలోకి డీజే వాహనాలు రాకుండా ఐదు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా డీజేలు వినియోగించినట్లయితే వాటిని సీజ్ చేసి.. సదరు వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
● గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా చేపట్టే శోభాయాత్రను ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. కోస్గి పట్టణంలోని వినాయక మండపాలను ఎస్పీ సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంత రం స్థానిక అధికారులతో కలిసి సర్జఖాన్‌పేట దండం చెరువులో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లతో పాటు రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. పెద్ద విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. మండలంలో 192, కోస్గిలో 35 విగ్రహాలు ఏర్పాటు చేశారని స్థానిక పోలీసులు వివరించారు. ఆయన వెంట సీఐ సైదులు, ఎస్‌ఐ బాల్‌రాజ్, పీఆర్‌ఓ వెంకట్ ఉన్నారు.
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి..
జిల్లా పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచరాదని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం, భరోసా కలిగేలా విదులు నిర్వర్తంచాలని సిబ్బందికి సూచించారు.