
రోడ్ల మరమ్మతుకు చర్యలు: కలెక్టర్
నారాయణపేట: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న బీటీ, మట్టిరోడ్ల మరమ్మతుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ పర్యటించి ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలకు సంబంధించిన బీటీ, మట్టిరోడ్లను పరిశీలించారు. ముందుగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ ఆఫీస్, పాత బస్టాండ్ మీదుగా పళ్లబ్రిడ్జి, ఎంబీ చర్చి వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డును చూశారు. అటు నుంచి ఎక్లాస్‌పూర్ మార్గంలోని లోకపల్లి లక్ష్మమ్మ గుడికి వెళ్లే మట్టిరోడ్డు స్థితిగతులను తెలుసుకున్నారు. ఇటీవల లోకపల్లి లక్ష్మమ్మ జాతరకు ముందు ఆ రహదారిని మట్టివేసి చదును చేయగా.. వారం క్రితం కురిసిన వర్షాలకు మట్టి రహదారి దెబ్బతిందని.. ఎగువ నుంచి వచ్చే వర్షపునీరు రహదారిపైకి చేరకుండా చిన్న కల్వర్టు మాదిరిగా పైపులు వేయాల్సి ఉందని పీఆర్ ఈఈ హీర్యా నాయక్ కలెక్టర్‌కు వివరించారు. అయితే రహదారి పక్కన ఉన్న వెంచర్ యజమాని పైపులు వేసేందుకు నిరాకరిస్తున్నాడని తెలిపారు. స్పందించిన కలెక్టర్.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఈఈకి సూచించారు. అనంతరం ఊట్కూరు మండలం వల్లంపల్లికి వెళ్లే మట్టి రోడ్డును కలెక్టర్ పరిశీలించా రు. చిన్నపాటి వర్షం కురిస్తే రోడ్డు మొత్తం చిత్తడిగా మారుతుందని.. తాత్కాలిక మరమ్మతు చేయిస్తా మని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. అయితే గతంలో ఈ రోడ్డు మరమ్మతుకు ఎన్ని నిధు లు మంజూరయ్యాయి.. ఇంకా ఎన్ని మిగిలి ఉన్నా యనే వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. చివరగా పట్టణంలోని యాదగిరి రోడ్డు పక్కన కొత్త కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న లో లెవల్ కల్వర్టును కలెక్టర్ పరిశీలించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఇక్కడ నీరు ఉధృతంగా ప్రవ హించడంతో రాకపోకలు నిలిచిపోయాయని.. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి చొరవతో అవతలి వైపు నుంచి తాత్కాలిక దారిని ఏర్పాటు చేసినట్లు కాలనీవాసులు కలెక్టర్‌కు తెలిపారు. అయితే కల్వర్టులో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ అధికారులతో విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై కలెక్టర్ చర్చించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, తెగిన చెరువులు, కుంటల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ, డీఈ రాములు, నీటిపారుదలశాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య పాల్గొన్నారు.