
నానో యూరియాతో అధిక దిగుబడి
మాగనూర్: నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని.. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. మంగళవారం మాగనూర్‌లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. దుకాణాల్లో ఎరువుల స్టాక్ వివరాలతో పాటు ధరల పట్టికను ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. ఎరువులు, పురుగు మందులు కొనుగోలుచేసే రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలన్నారు. రైతులు నానో యూరియా వినియోగంపై దృష్టిసారించాలని తెలిపారు. ఎకరాకు ఒక లీటర్ నానో యూరియా వినియోగించాలన్నారు. పంటల సాగులో ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట ఏఓ సుదర్శన్‌గౌడ్ ఉన్నారు.