
గాంధీనగర్ చేనేత కార్మికుల ఇళ్ల సర్వే
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ చేనేత సహకార సంఘం సభ్యుల ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయాలని, కార్మికులకు సభ్యత్వాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంలో నిరసనబాట పట్టడం.. అయ్యో నేతన్నా శీర్షికన 8న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. గాంధీనగర్ చేనేత సొసైటీలో నిజానిజాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం చేనేత జౌళీశాఖ అధికారి బాబురావు బృందం ఇంటింటి సర్వే చేపట్టింది. గాంధీనగర్ చేనేత సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్ల యజమానులు, వారి కుటుంబీకుల వివరాలు, చేనేత కార్మికులకు సభ్యత్వ నమోదుపై సమగ్ర విచారణ చేపట్టారు. నివేదికను త్వరలోనే కలెక్టర్‌కు అందించనున్నారు. 30ఏళ్ల తర్వాత గాంధీనగర్ చేనేత సొసైటీ కార్మికుల కష్టాలను తెలుసుకుంటున్న కలెక్టర్‌కు చేనేత కార్మిక కుటుంబాల తరఫున సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీ పట్టణ కార్యదర్శి కెంచ నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

గాంధీనగర్ చేనేత కార్మికుల ఇళ్ల సర్వే

గాంధీనగర్ చేనేత కార్మికుల ఇళ్ల సర్వే