నారాయణపేట: జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు యూరియా కోసం స్థానిక పీఏసీఎస్‌కు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే స్టాక్ లేదని.. మరుసటి రోజు వస్తుందని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న ప్రధాన రహదారిపైకి చేరుకొని ధర్నా చేపట్టారు. యూరియా కావాలి.. కలెక్టర్ రావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. యూరియా స్టాక్ వస్తుందని.. బుధవారం వచ్చి తీసుకెళ్లాలని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
బకాయిలు విడుదల చేయాలి
నారాయణపేట రూరల్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్, రాష్ట్ర నాయకుడు నరహరి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక శ్రీసత్యనారాయణ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించడంతో పా టు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.8,650 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలన్నారు. విద్యారంగ సమ స్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అశోక్, మహేశ్, నవీన్, కనకప్ప పాల్గొన్నారు.
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు