
జాతీయస్థాయికి ‘అనంతపురం’ విద్యార్థుల ప్రాజెక్టు
గద్వాలటౌన్ : 2024–25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనలో గద్వాల మండలం అనంతపురం పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ వారు పాఠశాల విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అనంతపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు జానకమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇర్ఫాన్, పవన్, ప్రశాంత్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనలో ప్రతిభ చాటారు. ‘మొక్కజొన్న కంకులపై పొట్టుతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ కార్న్ హస్క్ పెన్స్’ అనే అంశంపై ప్రాజెక్టును రూపొందించగా.. ఆ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జులై 28 నుంచి 31 వరకు డిల్లీలో జరుగుతున్న జాతీయస్థాయి ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనకు ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం 27 ప్రదర్శనలను ఎంపిక చేశారు. ఇందులో రాష్ట్రం నుంచి గద్వాలతో పాటు సిద్దిపేట, సిరిసిల్ల పాఠశాలలు ఉన్నాయి. అనంతపురం విద్యార్థులు జాతీయస్థాయి ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనకు ఎంపిక కావడంపై డీఈఓ అబ్దుల్ ఘనీ, ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా సైన్స్ అధికారి బాస్కర్‌పాపన్న, ఉపాధ్యాయలు హర్షం వ్యక్తం చేశారు.