
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
నారాయణపేట: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తన ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్‌లో మరికల్, ధన్వాడ, దామరగిద్ద, నారాయణపేట మండలాలు, పట్టణానికి చెందిన 75 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, రైతుభరోసా తదితర పథకాలతో అండగా నిలిచామన్నారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పేదల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను అమలుచేస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజా సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, ఆర్టీఓ బోర్డు సభ్యుడు పోషల్ రాజేశ్, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు మహమూద్ ఖురేషి, యూసుఫ్ తాజ్, పళ్ల అనిల్ వెంకుగౌడ్ పాల్గొన్నారు.