
రాజీవ్ యువ వికాసంపై అవగాహన కల్పించండి
నారాయణపేట: రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ సంబంధిత శాఖల అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఎన్‌ఆర్‌ఈజీఎస్, యూనిఫామ్ కుట్టు పని, లోగోస్ డాటా ఎంట్రీ, జీవిత భాగస్వామి పెన్షన్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా జిల్లాలో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 14, 2025 లోపు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ క్రింద టార్గెట్ పూర్తి చేయాలన్నారు. ఉదయం ఏడు గంటలకు ఫీల్డ్ లోకి వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. వరి ధాన్యం తడవకుండా చూడాలని టార్పాలిన్లు సిద్ధం చేయాలన్నారు. లేబర్‌ను ఎక్కువగా ఏర్పాటు చేసి ఎఫ్‌టిఓ జనరేట్ చేయాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాలలో తాగునీటి ఇబ్బందు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఓ మొగులప్ప, అధికారులు అబ్దుల్ ఖలీల్, రషీద్ పాల్గొన్నారు.
పోషకాహార ప్రాముఖ్యతను వివరించాలి
పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న పోషణా పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.కలెక్టరేట్‌లో జిల్లా పోషణ పక్షం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 8 నుండి 22 వరకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం, ప్రాజెక్ట్‌ల పరిధిలో జిల్లా స్థాయిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. 704 అంగన్ వాడీ కేంద్రాలలో 6 సంవత్సరాల లోపు చిన్నారులతో పాటు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపంతో భాధపడుతున్న వారిని గుర్తించి అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం ఇతర సేవలను పూర్తిగా వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.