రైతుల కష్టాలు పట్టవా ?
గ్రామాల్లో పర్యటించండి
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు తీవ్ర నష్టం
సంజామలను కరువు మండలంగా ప్రకటించాలి
వారం రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే రిలే నిరాహారదీక్షలు
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
కరువు రైతుకు
సంజామల: కరువు రైతుకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని బనగానపల్లె నియోజకర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి 75 శాతం పంట నష్టం కలిగిన సంజామల మండలాన్ని విస్మరించడంతో మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్య ప్రకాష్ రెడ్డి, సీపీఐ నాయకులు, రైతులతో కలసి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండల కేంద్రం సంజామల కోటబురుజు నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు శుక్రవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్‌కు సంజామలను కరువు మండలముగా ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం కాటసాని మీడియాతో మాట్లాడుతూ.. సంజామల వ్యవసాయ ఆధారిత మండలమని, ఖరీఫ్ సీజన్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయ అధికారులు నివేదికలు సమర్పించినా కరువు మండలం ప్రకటించకపోవడం మంత్రి బీసీ వైఫల్యమేనని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మెహన్ రెడ్డి, గిరిజన విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర యువజన కార్యదర్శి అంబటి రవి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాజశేకర్ రెడ్డి, నాయకులు లింగందిన్నె అన్నెం శివరామిరెడ్డి, ఆకుమల్ల గౌరిగారి నాగేశ్వర్ రెడ్డి, అక్కంపల్లె నాగిరెడ్డి, దేశాయ్ రెడ్డి, ఎస్సీ బాబు, ప్రసాద్ రెడ్డి, వసంతాపురం సత్యమయ్య, నరసింహారెడ్డి, రమేశ్వర్‌రెడ్డి, కమలపురి తులసిరెడ్డి, హోత్రమాన్‌దిన్నె సూర్యనారయణరెడ్డి, ముచ్చలపురి అస్సద్ అల్లిఖాన్, చ్రందశేఖర్, ప్రసాద్ రెడ్డి, ఎగ్గొని కృష్ణారెడ్డి, తోట వెంకటేశ్వర్ రెడ్డి, మల్లు శ్రీనివాస్ రెడ్డి, దారెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపేంద్రారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, రహంతుల్లా, సీపీఐ నాయకులు అబ్రహం, సూర్యనారాయణ, సంజీవులు, నాగాంజనేయులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి బీసీ గిమ్మిక్కులు ప్రజలు నమ్మరు
రాష్ట్ర విపత్తులశాఖ అధికారులకు లేఖ రాశానంటూ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి గిమ్మిక్కులతో రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని కాటసాని విమర్శించారు. చిన్న విషయాన్ని కూడా పబ్లిసిటీ చేసుకునే మంత్రి ఈనెల 2న లేఖ రాస్తే 7వ తేదీన సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఎందుకు చేసుకుంటున్నారని మండిపడ్డారు. సంజామల మండలంలో వైఎస్సార్‌సీపీ రైతులతో కలసి నిరసన కార్యక్రమం చేపడుతుందని తెలిసి సోషల్ మీడియాలో మంత్రి గిమ్మిక్కులు చేయ డం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జిల్లాలో కరువు మండలం ప్రకటించడానికి ముందే అధికారులు స్థానిక మంత్రులకు జాబితాను చూపుతారని అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మండల ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పలు గ్రామాల్లో తాగడానికి నీరులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రికి తెలియదా.. అని మండిపడ్డారు. సంజామల మండలాన్ని వారం రోజుల్లో కరువు మండలంగా ప్రకటించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సంజామలను కరువు మండలంగా ప్రకటించడంలో విఫలమయ్యారు. మంత్రికి సంజామల మండలంపై శీతకన్ను ఎందుకో అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే ఆలోచన లేదు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు అల్లాడుతుంటే కూటమి నాయకులు మాత్రం జల్సాలు చేసుకుంటున్నారు.
– ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్
కూటమి నేతలు, అధికారులు గ్రామాల్లో పర్యటిస్తే కరువు పరిస్థితులు తెలుస్తాయి. రైతులు పంటలు వేసి నష్టపోయి అప్పులపాలయ్యారు. కొన్ని గ్రామాల్లో తాగేందుకు నీళ్లు కూడా లేవు. స్థానిక మంత్రి నిర్లక్ష్యంతో కరువు మండలం ప్రకటించలేదు. సంజామలను కరువు మండలం ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం.
– చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి,
వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్


