నంద్యాల(వ్యవసాయం)/మహానంది: మహానందిలో ఈ నెల 11వ తేదీ నుంచి జరగనున్న శ్రీ కామేశ్వరీదేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ గంగ, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామి దంపతులు శనివారం నంద్యాలలోని శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ మౌళీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ నంద్యాల శ్రీ బ్రహ్మనందీశ్వరస్వామి ఆలయానికి సాగనంపారు. కాగా రాత్రి నంద్యాలకు చేరుకున్న స్వామికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ బోయ రామకృష్ణ ఈఓ లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు శివ, రాధాకృష్ణ శర్మ, మోహన్ గుప్తా అర్చకులు పాల్గొన్నారు.
ఉత్సవ పల్లకీలో ప్రహ్లాదవరదుడు
ఆళ్లగడ్డ: అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం మూలమూర్తులకు నిత్యపూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయం ముఖద్వారం మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ధూపదీపాలతో మహా మంగళహారతి అనంతరం నైవేద్యం నివేదించారు. రాత్రి స్వామి ఉభయ దేవేరులతో ఉత్సవ పల్లకీలో కొలువుదీరి మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. తిరిగి దేవాలయం చేరుకున్న అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి కార్యక్రమాన్ని ముగించారు.
బయలు వీరభద్రస్వామికి పరోక్షసేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామికి శనివారం అమావాస్య సందర్భంగా విశేషార్చన జరిపించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి పలువురు భక్తులు పరోక్షసేవ ద్వారా ఈ విశేషపూజ జరిపించుకున్నారు. ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపారు. అనంతరం పంచామృతాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు.
గడివేముల: మిద్దె కూలి చిన్నారి మృతి చెందిన సంఘటన గడివేముల మండలం బూజునూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. బూజునూరు గ్రామానికి చెందిన కురువ నాగమణి, కురువ వెంకటేశ్వర్లుకు 18 నెలల కూతురు నితీష ఉంది. ఈ చిన్నారి ఇంటి సమీపంలోని వరండాలో ఆడుకుంటుండగా పాత మిద్దె దూలం విరిగి పడడంతో చిన్నారికి తీవ్ర గాయాలై మృతి చెందగా, ఇదే ఘటనలో గాయపడిన నాయనమ్మ సుబ్బమ్మను చికిత్స కొరకు ప్రభుత్వ వైద్యశాల తరలించారు.
పోలీస్టేషన్‌లో
సీఐ పుట్టినరోజు వేడుకలు
బొమ్మలసత్రం: నంద్యాల టూటౌన్ పోలీస్టేషన్ సీఐ సుధాకర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. గత బుధవారం సీఐ పుట్టిన రోజు. టీడీపీకి చెందిన 1వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగార్జున ఆధ్వర్యంలో యువకులు భారీ ఎత్తున టూటౌన్ పోలీస్టేషన్ ఎదురుగా టపాసులు పేల్చి నానా హంగామా సృష్టించారు. పోలీస్టేషన్‌లోకి గుంపులుగా చేరుకుని సీఐతో కేక్ కట్ చేయించి తినిపించుకున్నారు. గతంలో సదరు సీఐ వన్‌టౌన్ పరిధిలో పనిచేసేటప్పుడు టీడీపీ నాయకులతో సన్నిహితంగా మెలగటం కారణంగానే ఈవేడుకలు జరిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే, వేడుకలకు హాజరైన వారిలో రౌడీషీటర్లు, గతంలో కేసులు నమోదైన వారు ఉన్నట్లు సమాచారం.


