● వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి
పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి
కర్నూలు (టౌన్): కొన్నేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిన నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఈవీఎంలతో గెలవాలనే కుట్రలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి విమర్శించారు. ఇప్పటికే ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కొత్త ఓటర్లను పక్కన పెట్టి స్థానిక సంస్థలకు వెళ్లేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఈవీఎంలతో గెలుస్తామన్న ధీమాను ప్రభుత్వం వ్యక్తం చేస్తోందని, దీని వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు.? ఈ రెండున్నర ఏళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారన్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం వారిని దగా చేసిందన్నారు. డీఎస్సీలో నిరుద్యోగులను మోసం చేయడంపై మండిపడుతున్నారన్నారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మందిని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరించడం, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే కుట్రలు చేస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమన్నారు.


