సమస్యను పరిష్కరిస్తాం
● జిల్లా జడ్జి పి. వాసు
ఎమ్మిగనూరు రూరల్: అదనపు కోర్టుల ఏర్పాటుతో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి పి.వాసు అన్నారు. గురువారం పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయాలను జిల్లా జడ్జి పి.వాసు, స్థానిక మేజిస్ట్రేట్ పి.హేమ బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి. వాసు మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు రూ.21 కోట్లు మంజూరు కాగా.. ఎమ్మిగనూరు కోర్టుతో పాటు అదనపు కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు రూ.2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి పాత తహసీల్దార్ కార్యాలయంలో ఒక కోర్టు భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మరో కోర్టును సిద్ధం చేశామన్నారు. రెండవ విడత కింద 11 కోర్టులను ప్రారంభిస్తామన్నారు. పది రోజుల్లో ఎమ్మిగనూరులో రెండు కోర్టులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. వీరితో పాటు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ బి.లీలా వెంకటశేషాద్రి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.రషీదుల్లా, జనరల్ సెక్రటరీ కె.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల(అర్బన్): జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపు పేపర్ల కొరత వేధిస్తోంది. ఇదే అదనుగా మూడు రెట్లు అదనపు ధరలతో కొందరు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. మరి కొందరు పెద్ద సంఖ్యలో నిల్వచేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండు నెలలుగా స్టాంపుల కొరత ఉన్నా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. ఈ నెల 1వ తేదీ నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అరొకరగా వస్తున్న వాటిని తమకు అనుకూలంగా ఉన్నవారికి పెద్ద మొత్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారు బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సివస్తోంది. స్టాంపుల బ్లాక్ మార్కెట్‌ను అధికారులు అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇష్టానుసారంగా ధరలు
జిల్లాలోని బండిఆత్మకూరు, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, పాణ్యం, డోన్, ప్యాపిలి, బగానపల్లె, బేతంచెర్ల, అవుకు, కోవెలకుంట్ల, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్టాంపులు దొరకకపోవడంతో క్రయవిక్రయ దారులు ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడంతో వారు వాటిని కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్‌లో స్టాంపులు కొనుగోలు చేయాల్సిరావడం భారంగా మారింది. నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరతతో ధరలు ఇష్టానుసారంగా పెంచారు. ఇదే పరిస్థితి కొనసాగితే అఫిడవిట్లు, ఒప్పందాలు, లీజుపత్రాలకు స్టాంపులు దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని క్రయవిక్రయ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని స్టాంప్‌ల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్టార్ కార్యాలయాలకు త్వరలో సంపూర్ణంగా స్టాంప్‌లు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే కొరత ఉంది. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తాం. బ్లాక్‌లో అదనపు ధరలకు స్టాంప్‌లు విక్రయిస్తే చర్యలు తప్పవు.
–అశోక్, జిల్లా రిజిస్ట్రార్, నంద్యాల


