చాపకింద నీరులా ‘కుష్టు’ | - | Sakshi
Sakshi News home page

చాపకింద నీరులా ‘కుష్టు’

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

చికిత్సతో నయమవుతుంది

సంవత్సర కాలంలో

35 కేసుల గుర్తింపు

సకాలంలో చికిత్సతో వ్యాధి నయం

ఈనెల 24 వరకు ఇంటింటి సర్వే

గోస్పాడు: కుష్టు వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. నంద్యాల జిల్లాలో ప్రస్తుతం 196 మంది వ్యాధిగ్రస్తులున్నారు. వారి కోసం నంద్యాల సమీపంలో, డోన్‌లో లెప్రసీకాలనీలు ఏర్పాటు చేశారు. నంద్యాల సమీపంలో ఉన్న కాలనీ శిథిలమైపోగా అక్కడ వ్యాధిగ్రస్తులు లేరు. జిల్లాలో గతేడాది నుంచి ఈ ఏడాది వరకు కొత్తగా 35 కేసులను గుర్తించారు. బాధితులకు ప్రభుత్వం నెలకు రూ.6 వేల చొప్పున పింఛన్‌ అందిస్తోంది.

అప్రమత్తత అవసరం...

చర్మంపై స్పర్శ తగ్గిన మచ్చలు ఉండటం.. చేతులు, కాళ్లలో తిమ్మిరి రావడం.. చర్మం దళసరిగా మారడం.. నరాలు మందంగా అనిపించడం.. గాయాలు ఏర్పడినా నొప్పి తెలియకపోవడం.. కనుబొమ్మల వెంట్రుకలు రాలడం.. చెవి దళసరిగా మారడం.. తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను నివారించవచ్చు. కుష్టు లోనూ రెండు రకాల వ్యాధులు ఉంటాయి. పాసి బాసిల్లరీ వ్యాధి ఉన్న వ్యక్తికి శరీరంపై ఐదు రకాల మచ్చలు ఉంటాయి. మల్టీబాసిల్లరీ వ్యాధి సోకిన వ్యక్తి శరీరంపై ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటాయి. స్పర్శ ఉండదు. చర్మం బయాప్సీలో యాసిడ్‌ ఫాస్ట్‌ బాసిల్లిని కనుగొనడంతో రోగాన్ని నిర్ధారిస్తారు. మల్టీ డ్రగ్స్‌ థెరపీతో కుష్టు వ్యాధిని నయం చేసుకోవచ్చు. పాసిబాసిల్లరీ కుష్టుకు ఆరు నెలల పాటు డాప్సోన్‌, రిఫాంపిపిన్‌, క్లోఫాజిమైన్‌ మందులతో మల్టీబాసిల్లరీ వ్యాధి గ్రస్తులకు 12 నెలల పాటు చికిత్స అందిస్తారని వైద్యులు చెబుతున్నారు.

అపోహలు వీడాలి

కుష్టు వ్యాధిపై సమాజంలో అనేక అపోహలున్నాయి. వ్యాధిగ్రస్తుడిని తాకితే తమకు వస్తుందని, జీవితాంతం అంటువ్యాధిగానే ఉంటుందని భావిస్తుంటారు. వాస్తవానికి మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్లే ఇది వస్తుంది. వ్యాధిగ్రస్తుడితో దీర్ఘకాలం సన్నిహితంగా ఉండటం వల్ల సంక్రమించే అవకాశం ఉంటుంది. తాకినంత మాత్రాన కుష్టు వ్యాధి రాదు. కలిసి భోజనంచేయడం, పక్కన కూర్చోవడం వల్ల కూడా సోకదు.

చిన్న మచ్చలుగా ఉన్నప్పుడు తెలుసుకుంటే మందులతో కుష్టు వ్యాధిని నయం చేయొచ్చు. జిల్లాలో సర్వే చేస్తున్నాం. వ్యాధిసోకిన వారు ఎలాంటి భయాందోళన చెందకుండా జాగ్రత్తగా మందులు వాడేతే నయమవుతుంది. వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. ఇంటి వద్దకు వచ్చే సర్వే బృందానికి ప్రజలు సహకరించాలి. – డాక్టర్‌ శారదాబాయి,

జిల్లా కుష్టునిర్మూలన అధికారి, నంద్యాల

ఇంటింటికీ వెళ్లి సర్వే

ఈ ఏడాది జిల్లాలో కుష్టు వ్యాధి ప్రారంభ దశ లక్షణాలను గుర్తించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 19,40,810 మందికి 14 రోజులపాటు ఇంటింటి సర్వే ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా కుష్టు నివారణ అధికారి ఆధ్వర్యంలో 1,611 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు సభ్యులుంటారు. మహిళలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రతి బృందంలో ఒక మహిళా సభ్యురాలు ఉంటారు. సర్వేకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement