నందికొట్కూరు: వృద్ధులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి కబర్ది, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. న్యూ మాడ్యూల్ క్యాంప్‌లో భాగంగా మంగళవారం పట్టణ సమీపంలోని శ్రీకాళీ ప్రసాద ఆశ్రమంలో వృద్ధులతో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో జిల్లా జడ్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి కబర్ది మాట్లాడుతూ.. 2016 కింద అందుబాటు లో ఉన్న న్యాయ సేవలు, వృద్ధులకు హక్కులు, రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. పిల్లల నుంచి ఆదరణ కరువై, సంరక్షణకు దూరమైన వారు ఆర్డీఓను సంప్రందించి తమ ఫిర్యాదులకు పరిష్కారం పొందవచ్చన్నారు. న్యాయ సేవల హెల్ప్‌లైన్ నంబరు 15100ను సంప్రందించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జీలు శోభారాణి, దివ్య, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం డ్యాం నీటి మట్టం
875 అడుగులు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం నీటిమట్టం మంగళవారం సాయంత్రం సమయానికి 875.20 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 164.7532 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. ఎగువ జూరా ల ప్రాజెక్ట్ నుంచి 11,500 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలంకు వచ్చి చేరుతుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 44,814 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు కేంద్రంలో 15.410 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 31,364 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు.
ఓపెన్ యూనివర్సిటీలోప్రవేశాలకు దరఖాస్తులు
శ్రీశైలంప్రాజెక్ట్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, గ్రూప్‌ల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.హుస్సేన్‌బాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విభజిత ఆంధ్రప్రదేశలో 2026–27 విద్యా సంవత్సరంలో మొట్టమొదటి సారిగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, 10+2లో పాసైన విద్యార్ధులు ప్రవేశాలకు అర్హులుగా పేర్కొన్నారు. ఇతర వివరాలకు శ్రీశైలం కో–ఆర్డినేటర్ ఎస్.మహేశ్వరరెడ్డి (9492942337)ని సంద్రించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
నేత్రదానంతో పునర్జన్మ
బొమ్మలసత్రం: మరణిస్తూ నేత్రదానం చేయటమంటే తిరిగి పునర్జన్మ పొందినట్లేనని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లాలో నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభం సందర్భంగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చేపట్టిన ర్యాలీలో డీఎంహెచ్‌ఓ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేత్రదానం వల్ల కలిగే ప్రజయోజనాలనపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆరోగ్యవంతులతో పాటు బీపీ, షుగర్, కంటి అద్దాలు వినియోగించే వారు కూడా నేత్రదానానికి అర్హులన్నారు. హెచ్‌ఐవీ, క్యాన్సర్, హైపటైటీస్ బీ ఉన్న వారు నేత్రదానం చేయకూడదన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు నాగమణి, శ్రీనివాసులు, యశోదర, పామన్న పాల్గొన్నారు.
టీటీడీలో అప్రెంటీస్‌షిప్ అవకాశాలు
డోన్ టౌన్: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఐటీఐ పాసైన విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ చేయడానికి అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్, డోన్ ప్రిన్స్‌పాల్ నాగకేశాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాఫ్ట్‌మన్ సివిల్‌లో 98, ఫిట్టర్ 16, టర్నర్ 4, మిషినిస్టు 4, రేడియో, టీవీ 4, ఎలక్ట్రీషీయన్ 23, వైర్‌మెన్ 21, సీఓపీఏ 20 చొప్పున ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 29వ తేదీ లోపల సమీప ప్రభుత్వ ఐటీఐల్లో 10వ తరగతి, ఐటీఐ మార్కుల జాబిత, తదితర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐల్లో సంప్రదించాలన్నారు.


