ప్రైవేట్‌ సత్రాల ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ సత్రాల ఇష్టారాజ్యం

Aug 26 2026 1:30 AM | Updated on Aug 26 2026 1:30 AM

తరచూ ప్రైవేట్‌ సత్రాల్లో ఆత్మహత్య ఘటనలు

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలోని ప్రైవేట్‌ సత్రాలపై దేవస్థాన అధికారులు పర్యవేక్షణ విస్మరించడంతో ప్రైవేట్‌ సత్రాలు దేవదాయ శాఖ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో పలు ప్రైవేట్‌ సత్రాల్లో దేవదాయ చట్టానికి విరుద్ధంగా కార్యక్రమాలతో పాటు తరచూ ఆత్మహత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అలాగే క్షేత్రంలో పోలీసుల నిఘా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీశైలం పరిధిలో ప్రస్తుతం సుమారు 70 సత్రాల వరకు ఉంటాయని అధికారుల అంచనా. ఆయా సత్రాలు దేవదాయ ధర్మదాయ శాఖ నిబంధనలు అనుసరించి సత్రానికి వచ్చే ఆదాయం, ఖర్చులు ప్రతి నెల దేవస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సత్రం ఆడిట్‌ను, నెల వారీ రిజిస్టర్‌ సైతం దేవస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే దేవస్థాన అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్‌ సత్రాలపై అజమాయిషీ క్రమక్రమంగా కోల్పోతూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆంగ్ల సంవత్సర వేడుకలు, కేక్‌ కటింగ్‌లు, బర్త్‌డే వేడుకలు, సినిమా పాటలకు డ్యాన్స్‌లు వేయడం తదితర కార్యక్రమాలు సత్రాల్లో చోటు చేసుకున్నా చర్యలు తీసుకోవడం లేదు.

పోలీసుల నిఘా శూన్యం..

శ్రీశైల క్షేత్రంలో ప్రైవేట్‌ సత్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ, భక్తులకు వసతి గదులు కేటాయించేటప్పుడు నిబంధనలు, ఆధార్‌, రేషన్‌కార్డు, పూర్తి వివరాల సేకరణ, గదులు ఒకరోజు మాత్రమే కేటాయింపు, ఫైర్‌ సేఫ్టీ పరికరాలు, అగ్నిప్రమాదం జరిగితే బయటికి వెళ్లేందుకు మార్గం, పార్కింగ్‌, అనుమానిత వ్యక్తులపై నిఘా తదితర నిబంధనలను ప్రైవేట్‌ సత్ర నిర్వాహకులు పాటిస్తున్నారా.. లేదా అనే విషయాలను తరచూ పోలీసు శాఖ తనిఖీలు నిర్వహిస్తుండాలి. ఆ దిశగా పోలీసు వ్యవస్థ పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనిసిస్తుంది. 48 గంటల కంటే ఎక్కువ రోజులు వసతి గది కేటాయించకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోకుండా వడ్డెర సత్రం నిర్వాహకు లు వసతి గది కేటాయించడం వెనుక దేవస్థాన అధికారులు, పోలీసు శాఖ నిర్లక్ష్యం ఉందని తెలుస్తుంది. తరచూ క్షేత్రంలోని పలు సత్రాలపై కార్డెన్‌సెర్చ్‌ లాంటి తనిఖీలు నిర్వహిస్తే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement