శ్రీశైలం టెంపుల్: సెప్టెంబర్ మాసానికి సంబంధించి స్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం, ఆర్జితసేవాటికెట్లను మంగళవారం విడుదల చేయనున్నట్లు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఈఓ మాట్లాడుతూ భక్తులు సులభంగా ఆయా టికెట్లు పొందేందుకు వీలుగా 90శాతం టికెట్ల ను మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించామన్నారు. మిగిలిన 10 శాతం టికెట్లను ఏపిటిఎస్ వెబ్‌సైట్ www.tms.ap.gov.in ద్వారా పొందవచ్చన్నారు. స్వామివారి ఆర్జిత గర్భాలయఅభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన 14 రకాల ఆర్జితసేవలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా పొందవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దర్శనం, ఆర్జితసేవా టికెట్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
27న విద్యార్థులతో పీఎం ముఖాముఖి
నంద్యాల (న్యూటౌన్): జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ‘మై భారత్ యువ కనెక్ట్ ప్రొగ్రామ్’లో భాగంగా ఈనెల 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శిశకళ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 113 వినతులు
బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి 113 వినతులు అందినట్లు జిల్లా ఎస్పీ సునీల్‌షొరాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదుల్లో అధికంగా ఆస్తి తగాదాలు, నగదు మోసాలు, అత్తింటి వేధింపులు లాంటి కేసులు వస్తున్నాయన్నారు. ఇందులో క్రిమినల్ కేసులుగా పరిగణించే ఫిర్యాదులకు సత్వరమే స్పందించి ఆయా స్టేషన్ అధికారులతో మాట్లాడామన్నారు. పీజీఆర్‌ఎస్ నుంచి స్టేషన్‌కు వెళ్లిన ఫిర్యాదును పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శ్రీశైలంలో అపచారం
● గర్భగుడిలోకి చెప్పులతో
ప్రవేశించిన మహిళ
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో భద్రతా వైఫల్యంతో అపచారం చోటుచేసుకుంది. దేవస్థాన అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ చెప్పులు ధరించి గర్భగుడిలోకి ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో శ్రావణ శుక్రవారం రోజున ఉచిత క్యూలైన్ ప్రవేశ ద్వారం నుంచి ఓ మహిళ చెప్పులు ధరించి ఆలయంలోకి ప్రవేశించింది. ఎస్‌కేడీ గేటు వద్ద నుంచి ధ్వజస్తంభం మీదుగా స్వామివారి దర్శనానికి ఆ మహిళ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచిన తరువాత కంటితుడుపు చర్యగా ఉచిత క్యూలైన్ వద్ద ఆ రోజు విధులు నిర్వర్తించిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై వేటు వేశారు. వీరి విధులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం పోరాటం ఉద్ధృతం
నంద్యాల (వ్యవసాయం): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం పోరాటం ఉద్ధృతం చేస్తామని రాయలసీమ జేఏసీ నాయకులు సీనియర్ న్యాయవాదులు ప్రతాపరెడ్డి, ఓబుల్ రెడ్డి, చేపురి మద్దిలేటి అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. కర్నూలులో కూటమి ప్రభుత్వం శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకుండా సర్క్యూట్ బెంచ్, మొబైల్ బెంచ్ అంటూ ప్రచారం చేయడం తగదన్నారు. శాశ్వత హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు న్యాయవాదులు సోమవారం నుంచి శనివారం వరకు విధులకు దూరంగా ఉండాలన్నారు. సమావేశంలో న్యాయవాదులు రామచంద్రారావు, వివేకానంద రెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, సాయిరాం, నూర్ ఆలం ఖాద్రి, కృపావతి, రఘుప్రకాష్, శ్రీనివాసులు, ప్రసాద్, జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


