డోన్ టౌన్: ‘వ్యాపారంలో నష్టాలు వచ్చాయి.. బతకలేం.. ఆదుకోండి’ అంటూ సూసైడ్‌నోట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ , టీజీ భరత్‌కు విన్నవిస్తూ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. భర్త మృతి చెందగా భార్య చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం గురువారం డోన్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. డోన్ పట్టణం శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులశెట్టి నెయ్యి, పసుపు వ్యాపారం చేస్తున్నాడు. ఒక కంపెనీ బిస్కెట్ ఏజెన్సీ డీలర్‌గా ఉన్నాడు. వ్యాపారం కోసం పలుచోట్ల తెలిసిన వారి వద్ద, స్నేహితుల వద్ద దాదాపు రూ. 2 కోట్ల వరకు అప్పులు చేశాడు. వ్యాపారం కలిసి రాక నష్టాలు రావడంతో అప్పులు తీర్చే మార్గం లేక శ్రీనివాసులు మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రాత్రి భార్య పద్మావతితో కలిసి ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం పాలు పోయడానికి వచ్చిన వ్యక్తి గమనించిన స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసుల పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. భార్య పద్మావతికి డోన్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతునికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు విద్య పూర్తి చేసుకొని ఉద్యోగ అన్వేషణలోఉన్నాడు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నుంచి రూ.2 కోట్లు అందించాలని, తమ కుమారుడు (సందీప్)కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు.
సూసైడ్ నోట్‌లో సీఎం,
డిప్యూటీ సీఎంలకు విన్నపం
దంపతుల ఆత్మహత్యాయత్నం
భర్త మృతి.. చికిత్స పొందుతున్న భార్య
డోన్ పట్టణంలో విషాదం


