సామాన్యుల జీవితాలతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

సామాన్యుల జీవితాలతో చెలగాటం

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

నంద్యాల(న్యూటౌన్‌): పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచి సామాన్యుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని వామ పక్షాల నేతలు విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన, రాస్తారోకోలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రుడు, లక్ష్మణ్‌, సీపీఐ కార్యదర్శి ప్రసాద్‌, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిత్యావసర ధరలు పెరిగి పేదలపై భారం పడుతున్నా కేంద్ర ప్రభుత్వ ధరల నియంత్రణ చేపట్టకపోవడం దుర్మార్గమన్నారు. అమెరికాలోని అదానీ కేసులు మాఫీ చేసేంత వరకు ఏ మాత్రం ధర లు పెంచకుండా మాఫీ చేసిన మరుసటి రోజు నుంచే ప్రజలపైన ధరల పిడుగు వేయడం జరిగిందన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు చలించడం లేదన్నా రు. రైతులను నిర్లక్ష్యం చేసే పాలకులు రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు చౌడప్ప, బాబాఫకృద్దీన్‌, పుల్లా నరసింహులు, సుబ్బారావు, ధనుంజయుడు, శ్రీనివాసులు, రవి, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట..

పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ ఆర్‌ఎస్‌పీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌పీ జిల్లా కన్వీనర్‌ అప్పపోగు సుబ్బరాయుడు మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించేంత వరకు దశల వారీగా ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బాషా, గోపాలకృష్ణ, సలీంబాషా, లక్ష్మి, మున్ని, మేరీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement