టీడీపీ నాయకుడిపై కిడ్నాప్‌ కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుడిపై కిడ్నాప్‌ కేసు నమోదు

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

ఆదోని అర్బన్‌: రెవెన్యూ అధికారి(వీఆర్వో) అయిన సురేష్‌ను ఆదివారం రాత్రి టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుబేర్‌నాథ్‌ కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. వీఆర్వో సురేష్‌ భార్య జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుబేర్‌నాథ్‌, మరికొందరి హమాలీలపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. కుబేర్‌నాథ్‌కు వీఆర్వో లక్షల్లో అప్పు ఉందని, దీంతో ఆదివారం హమాలీలు వెళ్లి మాట్లాడి ఆయనను పిలుచుకుని పరిశ్రమలో ఉంచారని తెలిపారు. ఎంతసేపటికీ రాకపోవంతో భార్య జయలక్ష్మి భయాందోళన చెంది వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు వీఆర్వో నంబర్‌ను తీసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి వీఆర్వో సురేష్‌ను భార్యకు అప్పగించామన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుబేర్‌నాథ్‌, మరికొందరి హమాలీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు.

మహిళ ఆత్మహత్య

బేతంచెర్ల: ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల మేరకు గ్రామానికి చెందిన కిరణ్‌ భార్య లక్ష్మి (23) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. పలుచోట్ల వైద్యం చేయించుకున్నప్పుటికీ నయం కాలేదు. అలాగే కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా మనస్తాపానికి గురైన ఆమె సోమవారం రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబీకులు గుర్తించి 108లో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి కుమారులు దిలీప్‌, ధీరజ్‌ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రాక్టరు..కారు ఢీ

నలుగురికి తీవ్ర గాయాలు

చాగలమర్రి: మండలంలోని పెద్దబోధనం గ్రామం సమీపంలో 40వ నెంబరు జాతీయ రహదారిపై ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి కడపకు వెళ్తున్న స్వి్‌ఫ్ట్‌ డిజైర్‌ కారు అదే రహదారిపై వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక వైపు నుంచి వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మున్సీర్‌ బేగం, సమీర్‌, అప్జల్‌, సిద్దీఖ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో సిబ్బంది ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అలాగే క్రేన్‌ సహాయంతో కారును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement